Begin typing your search above and press return to search.

ఏపీలోని దేవుళ్ల‌పై భారీగా జీఎస్టీ ఎఫెక్ట్

By:  Tupaki Desk   |   1 July 2017 5:33 PM GMT
ఏపీలోని దేవుళ్ల‌పై భారీగా జీఎస్టీ ఎఫెక్ట్
X
స‌ర్వంత‌ర్యామి అయిన దేవుడిని సైతం కొత్త‌గా వ‌చ్చిన వ‌స్తు సేవ‌ల ప‌న్ను వ‌ద‌ల‌లేదు. అన్ని రంగాల‌ను త‌న ప‌రిధిలోకి తీసుకువ‌చ్చేసుకున్న ఈ అతిపెద్ద ఆర్థిక సంస్క‌ర‌ణ‌లోకి దేవాల‌యాలు కూడా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. రూ.20లక్షల ఆదాయాన్ని మించిన దేవాలయాలను జీఎస్టీ పరిధిలోకి కేంద్రం తీసుకురావ‌డంతో ఏపీలోని దేవాల‌యాల‌పై భారీగానే ఎఫెక్ట్ ప‌డింది. సుమారుగా 179 ఆల‌యాలు ఈ ప‌రిధిలో ఉన్న‌ట్లు స‌మాచారం. జీఎస్టీ ఎఫెక్ట్ గురించి తెలియ‌జేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం పంపిన లేఖ‌ల‌ను స్వీక‌రించిన ఆయా ఆల‌యాల ఈఓలు చిట్టాప‌ద్దుల లెక్క‌లు స‌రిచూసుకుంటున్నార‌ట‌.

ఏపీలో అధికారిక లెక్క‌ల ప్ర‌కారం 23,834 ఆలయాలు ఉన్నాయి. వీటిలో 179 దేవాల‌యాల్లో రూ.20ల‌క్ష‌ల‌కు పైగా ఆదాయం, 5 దేవాల‌యాలు 25ల‌క్ష‌లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. తాజా ఆదేశాల‌ ప్ర‌కారం త‌మ ఆదాయ వివ‌రాల‌ను స‌రిచూసుకుంటున్న‌ట్లు స‌మాచారం. కాగా, 20ల‌క్ష‌ల‌కు పైబ‌డిన ఆదాయం ఉన్న దేవాల‌యాల‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తీసుకువ‌చ్చినప్ప‌టికీ ప్ర‌సాదాన్ని జీఎస్టీలో చేర్చ‌లేదు. అయితే ప్ర‌సాదాల‌కు అవ‌స‌ర‌మైన జీడిప‌ప్పు, నెయ్యిపై మాత్రం ప‌న్నుమోగ‌నుంది. ఇంతేకాకుండా దేవాల‌యాల్లోని కీల‌క సేవ‌ల‌పై సైతం ప‌న్నుభారం ప‌డింది. దేవాలయాల్లో వినియోగించే అగరబత్తులు, వివిధ సేవల టికెట్లు, హుండీలు, తలనీలాలు,అద్దెగదులు, తదితరాలపై జీఎస్టీ అమలవనుంది.

అయితే ప‌విత్ర పుణ్య‌క్షేత్రం అయిన తిరుప‌తికి మాత్రం మిన‌హాయింపు ద‌క్కింది. తిరుపతిలో తలనీలాలపై జీఎస్టీకి మినహాయింపు దొరికింది. ఏపీ స‌ర్కారు అభ్యర్థన మేరకు కేంద్రం ఈ మిన‌హాయింపును అందించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/