Begin typing your search above and press return to search.

జీఎస్టీ...ఎన్ని రకాలు, ఎవరి వాటా ఎంత !

By:  Tupaki Desk   |   16 Aug 2021 7:45 AM GMT
జీఎస్టీ...ఎన్ని రకాలు, ఎవరి వాటా ఎంత !
X
మన దేశంలోని పరోక్ష పన్నుల విధానంలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అతిపెద్ద సంస్కరణగా చెప్పాలి. పలు రకాల పన్నులను (సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ టాక్స్, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, సర్ చార్జీలు, రాష్ట్ర స్థాయిలో వ్యాట్, ఆక్ర్టాయ్ వంటివి) విలీనం చేసి జీఎస్టీని అమల్లోకి తెచ్చారు. ఈ జీఎస్టీ విధానం మన దేశంలో 2017 జూలై నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పలు రకాల పన్నుల స్థానంలో జీఎస్టీ విధిస్తున్నారు. వస్తుసేవలపై శ్లాబుల వారీగా పన్నును విధించడం జీఎస్టీతో మొదలుపెట్టారు.

పన్ను శ్లాబులు సున్నా శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉన్నాయి. కొన్ని పన్నులు మినహా దాదాపు అన్ని రకాల పన్నులను కలిపి సమగ్రమైన జీఎస్టీని తెచ్చారు. జీఎస్టీ పరిధిలోకి రాని వాటిలో పెట్రోలియం ఉత్పత్తులు, ఆల్కహాల్ డ్రింక్స్, విద్యుత్ ఉన్నాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలు వేరేగా పన్నులను విధిస్తున్నాయి. కొన్ని రకాల ఉత్పత్తులపై జీఎస్టీతో పాటు సెస్ ను కూడా విధిస్తున్నారు. విలాసవంతమైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, ఎయిరేటెడ్ డ్రింక్స్ వంటి వాటిపై జీఎస్టీతో పాటు సెస్ కూడా ఉంది. దీని మూలంగా సంబంధిత ఉత్పత్తుల ధరలు మరింతగా పెరుగుతాయి. జీఎస్టీ అమలు తర్వాత చాలా రకాల ఉత్పత్తులపై పన్నులు తగ్గాయని చెబుతుంటారు.

అమ్మకం, బదిలీ, కొనుగోలు, లీజు, దిగుమతి లేదా సర్వీసులకు సంబంధించిన అన్ని లావాదేవీలపై జీఎస్టీని వసూలు చేస్తారు. అన్ని రకాల ఉత్పత్తులపై జీఎస్టీ ఒకే విధంగా ఉండదు. మనం నిత్యంవాడే వస్తుసేవల పై జీఎస్టీ వేర్వేరుగా ఉంటుంది. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా వినియోగదారుడు ఆ వస్తువులు లేదా సేవలపై ఒకే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే జీఎస్టీని మూడు రకాలుగా విభజించారు. సెంట్రల్‌ జీఎస్టీ (CGST), రాష్ట్ర జీఎస్టీ (SGST), ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ (IGST). అయితే ఈ మూడు రకాల జీఎస్టీల అర్థాలు ఏమిటో తెలుసుకుందాం...

1. సెంట్రల్‌ జీఎస్టీ (CGST) :
సెంట్రల్‌ జీఎస్టీ .. అంటే కేంద్ర వస్తువులు మరియు సేవా పన్ను. అంటే రాష్ట్రంలో ఏదైనా వస్తువుల సరఫరా లేదా సేవలు పొందినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే పన్నును సీజీఎస్టీ అంటారు. ఒక వ్యాపారవేత్త తన రాష్ట్రంలో మరొక వ్యాపారి నుంచి వస్తువులను తీసుకోవడం లేదా ఇతర సేవలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఈ జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది.

2. ఐజీఎస్టీ (IGST) : ఐజీఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ టాక్స్‌. సమగ్ర వస్తుసేవల పన్ను అని అర్థం. అంటే అంతరాష్ట్ర (రాష్ట్రాల మధ్య) వ్యాపారం లేదా వాణిజ్యంలో భాగంగా వస్తువులు, సేవల సరఫరాపై ఐజీఎస్టీ చట్టం కింద విధించే పన్ను. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ వాటాను కలిగి ఉంటుంది. రాష్ట్రాల వాటాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబడుతుంది. ఐజీఎస్టీ సేకరించే హక్కు కేంద్రానికి మాత్రమే ఉంటుంది. కేంద్ర, రాష్ట్రం రెండూ మరొక దేశం నుంచి ఉత్పత్తులు లేదా సేవలపై పన్ను పొందుతాయి. ఐజీఎస్టీ కింద వసూలు చేసే పన్నును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. వస్తుసేవలను వినియోగించే రాష్ట్రానికి పన్నులోని ఎస్జీఎస్టీ భాగం వెళుతుంది. ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ ను క్లెయిమ్ చేసుకోవడానికి ఐజీఎస్టీ దోహదపడుతుంది.

3. స్టేట్‌ జీఎస్టీ (SGST) :
స్టేట్‌ జీఎస్టీ (SGST) అంటే రాష్ట్ర వస్తువులు మరియు సేవా పన్ను అని అర్థం. రాష్ట్రంలో ఏదైనా వస్తువులు సరఫరా చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లే పన్నును రాష్ట్ర జీఎస్టీ అంటారు. ఒక వ్యాపారి తన సొంత రాష్ట్రంలోని మరొక వ్యాపారి నుంచి ఏదైనా వస్తువులు దిగుమతి చేసుకున్నప్పుడు ఈ లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వానికి సీజీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. సీజీఎస్టీ ద్వారా వచ్చే రాబడిని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. దీన్ని ఎస్జీఎస్టీతో కలిపి విధిస్తారు. రాబడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి.

జీఎస్టీ మండలి : వస్తుసేవల పన్నుకు సంబంధించిన రేట్లు, నిబంధనలు, రెగ్యులేషన్లను జీఎస్టీ మండలి చూసుకుంటుంది. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రితో పాటు రాష్ర్టాల ఆర్థిక మంత్రులు కూడా ఉంటారు. విభిన్న వర్గాల నుంచి వచ్చే అభ్యర్థనలు, డిమాండ్లను బట్టి జీఎస్టీ మండలి వివిధ వస్తుసేవలపై విధించే పన్నుల్లో మార్పులు చేర్పులు చేస్తుంది. ఇప్పటికే అనేక మార్పులు జీఎస్టీ మండలి సమావేశమై ఈ కొత్త పన్నుల విధానానికి సంబంధించిన మార్పులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంది.

ఐటీఆర్‌ రిటర్న్‌.. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. జీఎస్టీ వ్యవస్థలో వ్యాపారుల వ్యాపారంపై పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి నెలా మొత్తం అమ్మకాలు, కొనుగోళ్లు, పన్నులు తదతర వివరాలు ప్రభుత్వానికి చేరుతాయి. ఈ వివరాలన్ని ఆన్‌ లైన్‌ లో పొందుపరుస్తారు. ఇది జీఎస్టీ రిటర్న్‌ వ్యవస్థ. వ్యాపారం సరిగ్గా లేకపోవడంపై డిపాజిట్‌ చేసిన పన్నులు క్రెడిట్‌ ల రూపంలో వ్యాపారులకు తిరిగి చెల్లించడం జరుగుతుంది.