Begin typing your search above and press return to search.

12 అడుగులు పడితే జీఎస్టీ అమల్లోకి..

By:  Tupaki Desk   |   5 Aug 2016 8:09 AM GMT
12 అడుగులు పడితే జీఎస్టీ అమల్లోకి..
X
పదహారేళ్లుగా సా..గుతున్న జీఎస్టీ వ్యవహారం బుధవారంతో ఒక కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు సంబంధించిన సవరణలతోకూడిన బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన నేపథ్యంలో జీఎస్టీని అమల్లోకి తీసుకురావటానికి అవసరమైన అతి పెద్ద అవరోదం తొలిగిపోయిందని చెప్పాలి. రాజ్యసభలో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుందా? లేదా? అన్న సందేహాల నడుమ.. మోడీ సర్కారు అనుభవించిన టెన్షన్ అంతా ఇంతా కాదు. కానీ.. మోడీ వేసిన మాస్టర్ ప్లాన్ తో అందరి అంచనాలకు భిన్నంగా చాలా స్మూత్ గా జీఎస్టీ బిల్లు ఆమోదం పొందింది.

మరి.. రాజ్యసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు చట్టం రూపంలో ప్రజల చెంతకు రావటానికి మరెంత కాలం పడుతుందన్నప్రశ్నకు ఎంత లేదన్నా.. మరో ఏడాది పడుతుందన్న మాట వినిపించినా.. కేంద్రం మాత్రం మార్చి 31, 2017ను డెడ్ లైన్ గా పెట్టుకుంది. ఎందుకంటే.. వ్యాపార వర్గాలకు సంబంధించిన వార్షిక సంవత్సరం ప్రతి ఏప్రిల్ ఒకటి నుంచి షురూ కానున్న నేపథ్యంలో.. జీఎస్టీ చట్టాన్నివచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలన్న పట్టుదలతో ఉంది. దీనికి కారణం లేకపోలేదు. పన్ను వ్యవస్థ పూర్తిగా మారిపోనున్న నేపథ్యంలో.. ఆర్థిక సంవత్సరం మధ్యలోతీసుకొస్తే.. పన్ను లెక్కింపు విధానంలో చాలా సమస్యలు ఎదురు కావటం ఖాయం. అందుకే.. జీఎస్టీని 2017 ఆర్థికసంవత్సరం తొలి రోజు నుంచే అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

మరి.. జీఎస్టీ చట్టాన్ని అమల్లోకి తీసుకురావటానికి ఉన్న అడ్డంకులు ఏమిటి? ఏయే దశల్ని బిల్లు దాటాల్సి ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదే అంశాన్ని పరిశీలిస్తే.. మొత్తం పన్నెండు దశల్ని దాటేస్తే..జీఎస్టీ బిల్లు కాస్తా కొత్త చట్టంగా మారిపోయి పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని చెప్పొచ్చు. జీఎస్టీ రోడ్ మ్యాప్ ను చూస్తే..

మొదటి అడుగు; రాజ్యసభలో ఆమోదం పొందిన సవరణ బిల్లును 30 రోజుల వ్యవధిలో కనీసం 16 రాష్ట్రాల్లో ఆమోదం పొందేలా చేయటం

రెండో అడుగు; రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన తర్వాత జీఎస్టీ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది

మూడో అడుగు; అలా ఏర్పాటు చేసిన జీఎస్టీ కౌన్సిల్ కు నమూనా జీఎస్టీ నిబంధనల్ని సిఫార్సు చేయటం

నాలుగు అడుగు; అంతర్ రాష్ట్రాలకు సంబంధించిన చట్టాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయటం

ఐదో అడుగు ;రాష్ట్రాల వారీగా అమలు చేయాల్సిన ‘జీఎస్టీ’కి అన్ని రాష్ట్రాలు ఆమోదాన్ని తెలపటం

ఆరో అడుగు; అంతర్ రాష్ట్రాలకు.. రాష్ట్రాలకు చెందిన ‘జీఎస్టీ’ చట్టాల్ని శీతాకాల సమావేశాల్లో ఆమోద ముద్ర వేయించటం

ఏడో అడుగు; ఈ చట్టాన్ని అమలు చేసేందుకు వీలుగా కేంద్ర.. రాష్ట్ర అధికారులకు శిక్షణను పూర్తి చేయటం (డిసెంబరు నాటికి చేయాలి)

ఎనిమిదో అడుగు; జీఎస్టీకి సరిపోయే సాఫ్ట్ వేర్ ను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేయటం

తొమ్మిదో అడుగు; జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో జీఎస్టీ సాఫ్ట్ వేర్ ను ప్రయోగాత్మకంగా పూర్తి స్థాయిలో పరీక్షించటం

పదో అడుగు; జీఎస్టీ చట్టానికి సంబంధం ఉన్న అన్ని విభాగాల వారితో సంప్రదింపుల్ని 2017 మార్చి నాటికి పూర్తి చేయటం

పదకొండో అడుగు; జీఎస్టీ నిబంధనలకు సంబంధించిన వివరాలతో కూడిన నోటిఫికేషన్ ను మార్చికి ముందే విడుదల చేయటం

పన్నెండో అడుగు; ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యాట్ సర్వీస్ ట్యాక్స్.. కేంద్ర ఎక్సైజ్ పన్నుల్ని జీఎస్టీలో వీలీనం చేసి.. జీఎస్టీని అధికారికంగా అమలు చేయటం