Begin typing your search above and press return to search.

రాహుల్ నోట కీల‌క హామీ వ‌చ్చింది

By:  Tupaki Desk   |   7 Nov 2017 5:19 AM GMT
రాహుల్ నోట కీల‌క హామీ వ‌చ్చింది
X
ప్ర‌త్య‌ర్థిని దెబ్బ కొట్టాలంటే స‌మ‌యం.. సంద‌ర్భం రెండూ అవ‌స‌ర‌మే. ఇలాంటివి గుర్తించి స్పందించే వారికి తిరుగు ఉండ‌దు. టైమింగ్ విష‌యంలో కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మార్చుకోవాల్సింది చాలానే ఉంది. ఆ విష‌యాన్ని ఆయ‌న కూడా గుర్తించిన‌ట్లున్నారు. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న‌కు కంటెంట్ రాసే వ్య‌క్తి.. ఆయ‌న‌కు సూచ‌న‌లు చేసే మెంటార్‌ మారిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఆయ‌న‌ మాట‌లోనూ.. న‌డ‌త‌లోనూ ఈ మ‌ధ్య‌న మార్పు కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

చురక‌త్తుల్లాంటి చురుకైన వ్యాఖ్య‌లు చేయ‌టం.. మోడీ ప‌రివారానికి షాకిచ్చేలా ఆయ‌న మాట‌లు ఉంటున్నాయి. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌.. గుజ‌రాత్ రాష్ట్రాల్లో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చారం భారీగా సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల కాలంలో జీఎస్టీ ప‌న్నుపై మోడీ స‌ర్కారుపై వ‌చ్చిన వ్య‌తిరేక‌త తెలిసిందే.

దీన్ని తెలివిగా త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌టంతోపాటు.. జీఎస్టీలో చేయాల్సిన మార్పులు చాలానే ఉన్నాయ‌న్న సంకేతాన్ని ఇచ్చేలా రాహుల్ రియాక్ట్ అవుతున్నారు. ఇందుకు త‌గ్గ‌ట్లే.. తాజాగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ యువ‌రాజు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

2019లో కేంద్రంలో తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే వ‌స్తు సేవ‌ల ప‌న్నులో స‌మూల‌మైన మార్పులు తెస్తామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు.. వ్యాపారుల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచ‌ల్‌ ప్ర‌దేశ్ లో అవినీతి భారీ స్థాయిలో ఉంద‌న్న మోడీ ఆరోప‌ణ‌ల్ని రాహుల్ కొట్టిపారేశారు. నీతి అయోగ్ నివేదిక ప్ర‌కారం చూస్తే బీజేపీ అధికారంలో ఉన్న గుజ‌రాత్ తో పోలిస్తే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో అవినీతి త‌క్కువేన‌న్నారు.

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వ్యాప‌మ్ లాంటి కుంభ‌కోనాల్ని మోడీ ప్ర‌స్తావించ‌ర‌న్న ఎద్దేవా చేసిన రాహుల్ .. కేంద్ర స‌ర్కారు స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా.. ముందు చూపు లేకుండా తొంద‌ర‌పాటుతో జీఎస్టీని అమ‌ల్లోకి తెచ్చార‌ని మండిప‌డ్డారు. మోడీ స‌ర్కారు తొంద‌ర‌పాటుతో చిన్న‌ప‌రిశ్ర‌మ‌లు భారీగా దెబ్బ తిన్నాయ‌న్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దుతో న‌ల్ల‌ధ‌నం ఎంత బ‌య‌ట‌ప‌డింద‌న్న విష‌యాన్ని ప్ర‌పంచ‌మంతా తెలిసిందంటూ మోడీ నోట మాట రాని పాయింట్‌ ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌టం గ‌మ‌నార్హం.