Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్ ను పర్సనల్ గా టార్గెట్ చేసిన ఏపీ మంత్రి

By:  Tupaki Desk   |   25 April 2022 1:30 AM GMT
పవన్ కల్యాణ్ ను పర్సనల్ గా టార్గెట్ చేసిన ఏపీ మంత్రి
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరే రాజకీయ అధినేత మీద కానీ రాజకీయ నేత మీద కానీ జరగనంత వ్యక్తిగత దాడి ఒక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీదనే జరిగిందని చెప్పాలి. రాజకీయం వేరు వ్యక్తిగత జీవితం వేరు. అలా అని.. వ్యక్తిగతంగా చేసే తప్పుల్ని ఎత్తి చూపొద్దని చెప్పట్లేదు. కానీ.. అవసరం లేకున్నా.. సంబంధం లేకున్నా ఏదో ఒకలా పవన్ ప్రస్తావనను తీసుకురావటం ద్వారా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వైనం మరోసారి తెర మీదకు వచ్చింది. మూడు పెళ్లిళ్లు చేసుకోవటం తప్పేం కాదు.. నేరం కూడా కాదు.

ఎందుకంటే చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నారు. ఈ మాట అన్నంతనే రెండో పెళ్లికి సంబంధించిన విడాకులు అధికారికంగా ఇవ్వకముందే ఆయన మూడో భార్యతో సన్నిహితంగా ఉన్నట్లుగా ఆరోపిస్తారు. ఒకవేళ అదే నిజమని అనుకుందాం.. భార్య..భర్తలు ఇద్దరు ఇష్టపడి విడిపోయినప్పటికీ.. అధికారికంగా విడాకులు పొందటం వెంటనే జరగదు. ఎవరికి వాళ్లం బతుకుదామనుకున్నప్పుడు వేరే వారితో కనెక్టు కావటం తప్పేమవుతుంది?

విచిత్రమైన విషయం ఏమంటే.. పవన్ తో విడాకులు తీసుకున్న ఇద్దరు భార్యలు సైతం ఏ రోజు కూడా ఫిర్యాదు చేసింది లేదు. పవన్ తీరును ప్రశ్నించింది లేదు. వేలెత్తి చూపించింది లేదు. అంతేకాదు.. మాజీ భార్యలే కాదు.. వారితో కలిగిన పిల్లలు సైతం ఎవరూ పవన్ ను ప్రశ్నించినట్లుగా కనిపించదు. అయినప్పటికీ.. మూడు పెళ్లిళ్లు అని చెప్పి బద్నాం చేయటం వెనుక పెద్ద కుట్రే ఉందని చెప్పాలి.

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అధినేతలు.. నేతలకు ఉన్న చట్ట విరుద్ధమైన సంబంధాల గురించి ఒక్కడంటే ఒక్కడు మాట్లాడడు. వేలెత్తి చూపించరు. నిజానికి దొంగతనంగా చేసే చేష్టలకు కొదవ కాదు. కొన్ని సంబంధాల గురించి సామాన్యులకు అవగాహన ఉన్నా.. ముఖ్యనేతలు.. ప్రముఖులకు సంబంధించిన చీకటి భాగోతాలు చాలానే పాత్రికేయులు చాలా మందికి తెలుసన్నది మర్చిపోకూడదు. అలాంటి నేతలు సైతం పవన్ ను వేలెత్తి చూపించేలా చేయటాన్ని చూస్తే.. ఆయన్ను రాజకీయంగా దెబ్బ తీయటానికి కావాలనే ఇలా చేస్తున్నారని చెప్పాలి.

ఒకవేళ పవన్ చేసుకున్న మూడు పెళ్లిళ్లు తప్పే అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎంత మంది నేతలు రెండో పెళ్లి చేసుకున్నారన్నది అందరికి తెలిసిందే. మరి.. వాళ్ల పెళ్లిళ్ల మీద లేని ఫిర్యాదులన్ని పవన్ పెళ్లి మీదనే ఎందుకు? అన్నది ప్రశ్న. ఎందుకంటే.. పవన్ ను వేలెత్తి చూపించటానికి మరే ఇతర కారణాలు దొరకని వేళ.. ఇలా అయితే ఆయన్ను రాజకీయంగా దెబ్బ తీయటం చాలా తేలికన్న ఉద్దేశమేనని చెప్పాలి. అంతేకాదు.. పవన్ కు మహిళా అభిమానులు భారీగా ఉంటారు.నిజంగానే పవన్ చేసుకున్న మూడో పెళ్లి అంత పాపమే అయితే.. వారంతా ఆయన్ను దేవుడిగా ఎందుకు ఆరాధిస్తారు? ఇదంతా రాజకీయ ప్రత్యర్థులు ఆడే మైండ్ గేమ్ గా చెప్పాలి.

తాజాగా అలాంటి దరిద్రపుగొట్టు పనిని మరోసారి తెర తీశారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ రెరడ్డి. పవన్ కు ముగ్గురో.. నలుగురో భార్యలు ఉన్నారని లోకల్ గా ఒకరు నేషనల్ గా మరొకరు.. ఇంటర్నేషనల్ గా ఇంకొకరు ఉన్నారని చెబుతూ.. ‘ఆయన బహుభార్యా కోవిధుడు’ అంటూ దారుణ వ్యాఖ్య చేశారు. మంత్రి స్థానంలో ఉండి మహిళలకు ఇవ్వాల్సిన కనీస మర్యాద ఇవ్వని గుడివాడను ఏమనాలి? పవన్ ను టార్గెట్ చేశామని చెప్పుకునే వారు.. ఆ పేరుతో ఆయన మాజీ భార్యల ప్రస్తావన తేవటం నైతికంగా ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న. దీనికి వైసీపీ నేతలు ఏమని బదులిస్తారో చూడాలి.