Begin typing your search above and press return to search.

గుడివాడ..తడబాటు...ఆదిలోనే మంత్రి గారు...?

By:  Tupaki Desk   |   25 April 2022 2:30 AM GMT
గుడివాడ..తడబాటు...ఆదిలోనే మంత్రి గారు...?
X
ఉమ్మడి విశాఖ జిల్లా మంత్రి గుడివాడ అమరనాధ్ చెడుగుడు ఆడతారనే నమ్మి అధినాయకత్వం పదవిని కట్టబెట్టింది. ఉన్నత విద్యావంతుడు. మంచి మాటకారి అయిన గుడివాడ మీద జగన్ బాగా నమ్మకం పెట్టుకున్నారు. ఇక చంద్రబాబు, పవన్ సహా విపక్షాన్ని చీల్చిచెండాడడంలో గుడివాడ దిట్ట. సరే ఇదంతా పార్టీ అధికార ప్రతినిధిగా బాగానే సక్సెస్ అవుతుంది. అదే మంత్రిగా ఉంటే రాటుదేలాలి. పాలనా పరంగా అన్నీ చూసుకోవాలి. ఇక విపక్షాలకు చిక్కని తీరున రాజకీయ వ్యూహాలు కూడా రచించాలి. ప్రత్యర్ధులను ఎక్కడికక్కడ కట్టడి చేయాలి.

మరి గుడివాడ ఈ విషయంలో ఆదిలోనే తడబడుతున్నారు అని అంటున్నారు. గుడివాడ ఇలా మంత్రి అయ్యారో లేదో అలా విశాఖ ఉక్కు కర్మాగారం గుర్తింపు యూనియన్ ఎన్నికలు తోసుకువచ్చారు. దేశంలో పేరెన్నిక కన్న కర్మాగారం. ఇక్కడ గెలవడం కూడా చాలా ముఖ్యం. అయితే గుడివాడ సరిగ్గా వ్యూహరచన చేయలేకపోయారు అని సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. ఒక విధంగా కార్మిక సంఘం ఎన్నికలు అనుకున్నా అవతల ఇవతలా రాజకీయ పార్టీలే గట్టిగా నిలిచి ఉన్నాయి.

దాంతో గుడివాడ వైసీపీ అపర శత్రువు అయిన కాంగ్రెస్ అనుబంధ సంఘం ఇంటక్ కి ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నలు వస్తున్నాయి. వైసీపీ పోటీ చేసి ఓడితే ఆ కధే వేరు. కానీ కాంగ్రెస్ అనుబంధం అయిన ఇంటక్ కు మద్దతు ఇచ్చి గెలిచేస్తామని మంత్రి గారు ధీమా పడడం వల్ల సగం ఓటమి ఖాయమైందని, ఇక అటు కార్మికులను ఆకట్టుకోవడంలోనూ ఇటు నాయకుల మధ్య సమన్వయం చేసుకోకపోవడం వల్లనే వైసీపీ పూర్తిగా ఓడినట్టు అయిందని అంటున్నారు.

అదే టైమ్ లో టీడీపీ తరఫున కీలక నాయకులు పదునైన వ్యూహాలతో తొడగొట్టారు. అలా టీడీపీ మద్దతు ఇచ్చి మరీ ఏఐటీయూసీని గెలిపించుకున్నామన్న పేరు తెచ్చుకున్నారు. ఇది మంత్రిగా గుడివాడకు తొలి ఓటమి అంటున్నారు. దాంతో పాటు కొత్త జిల్లాగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో రెండేళ్ళ క్రితం మెడికల్ కాలేజ్ మంజూరు అయింది. అయింది దానికి కేటాయించిన ప్రభుత్వ భూమి వివాదంలో ఉండడంతో అడ్డంకులు ఎదురయ్యాయి. ఇపుడు అది వేరే చోటకు వెళ్ళిపోయింది.

అదే అనకాపల్లిలో మరో చోట ప్రభుత్వ భూమి చాలా ఉంది. అలా భూమిని చూపించి అనకాపల్లి గడప దాటకుండా మెడికల్ కళాశాలను చూడలేకపోయారు అని జనాలు గుస్సా అవుతున్నారు. విపక్షాలు కూడా దీని మీద మండిపడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా గుడివాడ ఉదాశీన వైఖరి కారణంగా నర్శీపట్నం నియోజకవర్గానికి మెడికల్ కళాశాల వెళ్ళిపోయింది అంటున్నారు.

అనకాపల్లిలో భూ వివాదం నడుస్తూండంగానే అక్కడి వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ ప్రభుత్వ భూమిని గొలుగొండలో చూపించి ఏకంగా మెడికల్ కళాశాలను అక్కడకు పట్టుకుపోయారని అంటున్నారు. దీంతో మంత్రి అయిన తొలిలోనే గుడివాడకు ఈ అపవాదు తప్పలేదు. మరి రాజకీయంగా వ్యూహాలు ఉండాలి. పాలనపరంగా దూకుడు ఉండాలి. అయితే కొత్తగా మంత్రి అయినందువల్ల తడబాటుకు ఓకే అనుకున్న ముందు ముందు రాటుతేలకపోతే మాత్రం ఆయనకే కాదు వైసీపీకి కూడా ఇబ్బందే అంటున్నారు. చూడాలి మరి.