Begin typing your search above and press return to search.

పవన్ ను మరోసారి టార్గెట్ చేసిన మంత్రి గుడివాడ!

By:  Tupaki Desk   |   16 Aug 2022 3:38 AM GMT
పవన్ ను మరోసారి టార్గెట్ చేసిన మంత్రి గుడివాడ!
X
ఏదో ఒక పాయింట్ పట్టుకొని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విరుచుకుపడే ధోరణి ఏపీ అధికార వైసీపీ నేతలు తరచూ ప్రదర్శిస్తుంటారు. పవన్ కల్యాణ్ నోటి నుంచి కీలక ప్రకటన ఏం వచ్చినా సరే.. ఆ వెంటనే రియాక్టు కావటం.. సంబంధం లేని అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చి.. పవన్ ను బలహీనుడిగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. తమ వాదనా పటిమతో పవన్ ను ఇరుకున పెట్టామన్న అల్ప సంతోషానికి గురి అవుతుంటారు. పవన్ వైపు ఒక వేలు చూపిస్తే.. తమ వైపు నాలుగు వేళ్లు చూపిస్తాయన్న విషయాన్ని మర్చిపోవటం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది.

జనసేనాని పవన్ ను తరచూ టార్గెట్ చేసే ఏపీ వైసీపీ నేతల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒకరు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయటానికి జనసేన పార్టీకి.. పవన్ కల్యాణ్ కు ఎప్పుడు స్వాతంత్య్రం వస్తుందో? అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు.. 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే స్వాతంత్య్రం ఉందా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తారో లేదో ముందుగా పవన్ చెప్పాలంటూ గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించిన వైనంపై జనసైనికులు మండిపడుతున్నారు.

ముందు మేం పోటీ చేస్తామా? లేదా? లాంటి ప్రశ్నలు వేయటం కాదని.. ప్రధాని నరేంద్ర మోడీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం లేకుండా.. సొంతంగా.. నికార్సుగా ఒక్కడిగా జగన్ కు పోటీ చేసే దమ్ముందా? అంటూ తీవ్రస్థాయిలో కౌంటర్ చేస్తున్నారు. తాము సొంతంగా పోటీ చేస్తామా? లేమా? అనే విషయంలో మంత్రి గుడివాడకు అంత కంగారు ఎందుకన్న ప్రశ్నను వారు సంధిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేసే స్వతంత్య్రం లేని పవన్ కల్యాణ్ స్వాతంత్య్రం గురించి మాట్లాడటం సిగ్గుచేటుగా ఘాటు విమర్శలు చేస్తున్న మంత్రి గుడివాడ తీరు గురివిందను తలపిస్తున్నట్లుగా ఫైర్ అవుతున్నారు జనసైనికులు.

2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీకి.. ఎవరెంత సాయం చేశారో అందరికి తెలుసని.. అన్ని సహాయాలు పొంది కూడా నోటి నుంచి చెప్పుకునే ధైర్యం లేని పార్టీ వారు.. తమపైనా.. తమ అధినాయకుడి మీద విమర్శలు చేసే స్థాయి లేదంటున్నారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాల మీద వైసీపీ నేతలకు ఎందుకంత ఉలుకు? అన్న ప్రశ్నను సంధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మేలు చేయటానికే పవన్్ ప్రయత్నిస్తున్నారే తప్పించి.. జనసేన పార్టీతో ఏపీ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్న గుడివాడ మాటల్ని చూస్తుంటే.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విషయంలో వైసీపీ ఎంతలా వణుకుతుందో ఇట్టే అర్థమవుతుందన్న మాట వినిపిస్తోంది.