Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ కాదు..పిరికి స్టార్..గుడివాడ షాకింగ్ పంచ్ లు

By:  Tupaki Desk   |   15 March 2020 12:21 PM GMT
పవర్ స్టార్ కాదు..పిరికి స్టార్..గుడివాడ షాకింగ్ పంచ్ లు
X
ఏపీలో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని కరోనా కారణంగా ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లుగా ఏపీ ఎన్నికల కమిషనర్ ప్రకటించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన వెంటనే.. సీన్లోకి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్ని రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేయటం తెలిసిందే. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు దౌర్జాన్యాలకు దిగుతున్నారని.. తమ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తలపై చేయి చేసుకుంటున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోల్ని కేంద్రం వద్దకు వెళ్లి వారికి చూపిస్తానని చెప్పారు.

ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పవన్ కల్యాణ్ మీద మండిపడుతున్నారు. ఆయన తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ మాట్లాడుతూ.. కరోనా వేళ.. ముందస్తు జాగ్రత్తల కోసమే ఎన్నికల్ని వాయిదా వేశారే తప్పించి.. రద్దు చేయలేదన్న ఆయన.. పవన్ తీరును తప్పు పట్టారు.

పవర్ కల్యాణ్ పవర్ స్టార్ కాదని.. పిరికి స్టార్ అంటూ అభివర్ణించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఫలితం ఒకేలా వస్తుందన్న ఆయన.. ఎన్నికల ప్రక్రియ ఎక్కడి వరకూ జరిగిందో.. అక్కడి నుంచే తర్వాత కూడా జరుగుతుందన్నారు. జనసేన పార్టీ ఆరేళ్ల వ్యవధిలో ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకుందన్న ఆయన.. అంతటి ఘనమైన రికార్డు ఆ పార్టీకి మాత్రమే సొంతమన్నారు. పార్టీ అధ్యక్షుడిగా రెండుచోట్ల పోటీ చేసి.. రెండుచోట్ల ఓడిన ఘనత కూడా పవన్ కల్యాణ్ పేరిటే ఉందన్నారు.

ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాను సైతం విమర్శించారు. విశాఖలో తన భూమి కబ్జాకు గురైందన్న ఆయన.. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదని ప్రశ్నించారు. భూకబ్జా జరిగి ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా? అన్న ఆయన.. విశాఖ కేంద్రం పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయటం ఇష్టం లేకనే కన్నా ఈ తీరులో విమర్శలు చేస్తున్నట్లుగా గుడివాడ మండిపడ్డారు.