Begin typing your search above and press return to search.

గుడివాడలో క్యాసినో... రంగంలోకి ఈడీ....?

By:  Tupaki Desk   |   8 Feb 2022 5:30 PM GMT
గుడివాడలో క్యాసినో... రంగంలోకి ఈడీ....?
X
వైసీపీ మంత్రి కొడాలి నానిని టీడీపీ బాగా టార్గెట్ చేసింది. ఆయన్ని వదల బొమ్మాళీ వదల టైప్ లో వెంటాడుతోంది. గుడివాడలో సంక్రాంతి సీజన్ లో క్యాసినో గేమ్స్ స్వయంగా మంత్రి గారి కన్వెన్షన్ సెంటర్ లో ఆడించారు అంటూ టీడీపీ నెల రోజులుగా అలుపెరగని పోరాటమే చేస్తోంది. నిజానికి టీడీపీ టార్గెట్ చేసిందంటే అది పక్కాగా ఉంటుంది.

నాని విషయం తీసుకుంటే ఆయన ఏకంగా చంద్రబాబునే విమర్శిస్తూ వచ్చిన నేత. పైగా బాబును ఎక్కడా కూడా గుక్కతిప్పుకోనీయకుండా హాట్ కామెంట్స్ చేస్తూ గడచిన రెండేళ్ళుగా చెలరేగిపోయారు. అయితే కొడాలి కామెంట్స్ కి రివర్స్ లో ఎటాక్ చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కానీ ఇపుడు చూస్తే నాని గుడివాడలో క్యాసినో గేమ్స్ విషయంలో దొరికేశారు అని టీడీపీ గట్ట్టిగా భావిస్తోంది.

అంతే ఎక్కడా తగ్గేదే లే అంటూ జోరు పెంచేసింది. మంత్రి గారి ఇలాకాలో క్యాసినో గేమ్స్ ఆడించారని, గోవా నుంచి ప్రత్యేకించి ప్రొఫెషనల్స్ ని రప్పించి మరీ కధ రక్తి కట్టించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో టీడీపీ వేసిన నిజ నిర్ధారణ కమిటీని కూడా గుడివాడ వెళ్లనీయకుండా వైసీపీ అడ్డుకుంది. ఆ మధ్య అది పెద్ద ఇష్యూ కూడా అయింది.

అంతటితో అది ఆగిపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ టీడీపీ మాత్రం దాన్ని నేరుగా పార్లమెంట్ లోనే ప్రస్థావించింది. రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ దీన్ని ప్రస్థావించి అసలు విషయం అంతా పెద్దల సభలో పెట్టేశారు. ఆ మీదట కూడా టీడీపీ తన పట్టు ఎక్కడా విడవలేదు.

ఇపుడు నేరుగా ఈడీని కలసి మరీ గుడివాడ క్యాసినో గేంస్ మీద విచారణ జరిపించాలని కోరింది. ఈ విధంగా ఈడీని కలసిన వారిలో ఎంపీలు కనకమేడలతో పాటు, కింజరాపు రామ్మోహననాయుడు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కూడా ఉన్నారు.

సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఈడీ అధికారులకు టీడీపీ బృందం వినతి చేసింది. అంతే కాదు, వందల కోట్ల రూపాయలు క్యాసినో గేమ్స్ ద్వారా చేతులు మారాయని కూడా ఫిర్యాదు చేసింది.

మొత్తానికి చూస్తే నాని చుట్టూ గట్టి ఉచ్చుని బిగించడం ద్వారా ఆయన్ని కార్నర్ చేయాలని టీడీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. మొత్తానికి గుడివాడలో తన కన్వెషన్ సెంటర్ లో ఎలాంటి క్యాసినో గేమ్స్ జరగలేదు అని నాని చెప్పినా టీడీపీ మాత్రం పక్కా అధారాలు ఉన్నాయని అంటోంది. మరి దీని మీద ఈడీ కూడా రంగంలోకి దిగితే మాత్రం నానికి ఇబ్బందులు తప్పవా అన్న చర్చ అయితే వస్తోంది. చూడాలి.