Begin typing your search above and press return to search.

గుడివాడ‌లో రైతుల‌క‌న్నా.. పోలీసులు క‌నిపిస్తున్నారే!

By:  Tupaki Desk   |   24 Sep 2022 11:11 AM GMT
గుడివాడ‌లో రైతుల‌క‌న్నా.. పోలీసులు క‌నిపిస్తున్నారే!
X
గుడివాడ‌లో టెన్ష‌న్ టెన్ష‌న్ వాతావ‌రణం నెల‌కొంది. ఏకంగా.. రెండు జిల్లాల నుంచి 500ల మంది పోలీసుల‌ను ఇక్క‌డ‌కు ర‌ప్పించి.. మ‌కాం వేయించారు. ఎక్క‌డ చూసినా.. పోలీసుల జీపులు.. సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లే క‌నిపిస్తున్నారు. వ‌జ్ర వాహ‌నాలు దీనికి అద‌నం.. అంతేకాదు.. పోలీసు బూటు చ‌ప్పుళ్ల‌తో.. గుడివాడ‌.. మార్మోగుతోంది. రాజ‌ధాని రైతులు చేస్తున్న మ‌హాపాద‌యాత్ర 2.0 తాజాగా గుడివాడ‌లో కొన‌సాగుతోంది. అయితే.. వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం.. ఆయ‌న రైతుల‌పై గ‌తంలో తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం.. రైతులు కూడా ఆయ‌న ప‌ట్ల గుర్రుగా ఉన్న నేప‌థ్యంలో ఏక్ష‌ణంలో ఏం జ‌రుగుతుందోన‌న్న ఉద్దేశంతో పోలీసులు ఇక్క‌డే మ‌కాం వేశారు.

అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలంటూ రైతులు చేపట్టిన రెండో విడత మహాపాదయాత్ర 13వ రోజుకు చేరింది. కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం ఈ పాదయాత్ర కొన‌సాగుతోంది. మచిలీపట్నం నియోజకవర్గం హుస్సేన్‌పాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర గుడివాడ నియోజకవర్గంలోకి ప్రవేశించిన విష‌యం తెలిసిందే.

పోలీసుల పాద‌యాత్ర‌!

గుడివాడలో జరుగుతున్న అమరావతి రైతుల మహాపాదయాత్రపై దృష్టి కేంద్రీకరించిన కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం ఆంక్ష‌లు విధించింది. జిల్లా నలుమూల నుండి గుడివాడకు 5 వందల మందికి పైగా పోలీసులు, అధికారులు. చేరుకున్నారు. గుడివాడ మార్కెట్ యార్డులో పోలీస్ యంత్రాంగానికి రుట్లు కేటాయించిన అధికారులు వారితో క‌వాతు చేయించారు.

ముందస్తు చర్యగా వజ్రా వాహనాలు, స్వాడ్‌ టీంలను రంగంలో దించారు. పట్టణ వీధుల్లో కవాతు నిర్వహించారు. నిబంధనలను అతిక్రమించి అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవని ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీచేశారు. దీంతో రైతుల క‌న్నా.. పోలీసులే.. పాద‌యాత్ర చేస్తున్న‌ట్టుగా అనిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

రైతుల‌తో వాగ్వాదం

గుడివాడలో రైతుల పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. కంకిపాడు మండలం దాములూరు టోల్‌గేట్‌ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఐడీ కార్డులు ఉన్న రైతులనే పాదయాత్రకు అనుమతించారు. ఐడీ కార్డులు లేని వారిని అనుమతించ లేదు. ఐడీ కార్డులు లేని కారణంగా రైతులను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఐడీ కార్డులు లేవంటూ కంకిపాడు పీఎస్‌కు 20 మంది రైతులను తరలించారు. ఐడీ కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తికాకముందే అడ్డుకోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వదం చోటుచేసుకుంది. ఏదేమైనా.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌శాంతంగా జ‌రిగిన రైతుల పాద‌యాత్ర‌.. గుడివాడ‌లో ఎలా ముందుకు సాగుతుందో అనే ఉత్కంఠ నెల‌కొన‌డం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.