Begin typing your search above and press return to search.

ప‌టేళ్ల కోట‌లో గుజ‌రాత్ సీఎం భారీ విజ‌యం

By:  Tupaki Desk   |   18 Dec 2017 7:40 AM GMT
ప‌టేళ్ల కోట‌లో గుజ‌రాత్ సీఎం భారీ విజ‌యం
X
గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు అనుకున్న‌ట్లే వ‌చ్చాయి. అయితే.. అంద‌రూ ఊహించిన దాని కంటే త‌క్కువ సీట్లు బీజేపీకి వ‌చ్చినా.. 22 ఏళ్ల బీజేపీ పాల‌న‌కు మ‌రో ఐదేళ్లు పొడిగింపును గుజ‌రాతీయులు ఇచ్చేశారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో ప‌టేళ్ల రిజ‌ర్వేష‌న్ల అంశం తీవ్రంగా ప్ర‌భావితం చేయ‌టంతో పాటు.. ప‌టేళ్ల కోట‌లో బీజేపీకి బీట‌లు వార‌టం ఖాయ‌మ‌న్న అంచ‌నా వ్య‌క్త‌మైంది.

ప‌టేళ్ల‌కు అడ్డా లాంటి రాజ్ కోట్ వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ బీజేపీ సీఎం విజ‌య్ రూపానీ తుది ఫ‌లితం ఏమ‌వుతుంద‌న్న ఉత్కంఠ ప‌లువురిలో నెల‌కొంది. ప‌టీదార్ ఉద్య‌మ నేత హార్దిక్ ప‌టేల్ బీజేపీకి వ్య‌తిరేకంగా విస్తృతంగా ప్ర‌చారం చేయ‌టంతో.. విజ‌య్ రూపానీ తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్న‌ట్లుగా మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. దీంతో.. ఆయ‌న విజ‌యం ఏమ‌వుతుంద‌న్న టెన్ష‌న్ క‌మ‌ల‌నాథుల్లోనూ ఏర్ప‌డింది.

ఎన్నిక‌ల వేళ ఉన్న టెన్ష‌న్‌ ను క్యారీ చేస్తూ.. ఫ‌లితాల వేళ‌లోనూ అలాంటి ప‌రిస్థితే చోటు చేసుకుంది. ఓట్ల లెక్కింపు మొద‌లైన వెంట‌నే.. విజ‌య్ రూపానీ స్వ‌ల్ప అధిక్య‌త‌ను క‌న‌బ‌ర్చారు. అయితే.. ఆయ‌నకు పోటీగా బ‌రిలోకి దిగిన రాజ్ గురు ఒకద‌శ‌లో ఆరువేల ఓట్లు పైచిలుకు అధిక్య‌త క‌న‌బ‌ర్చ‌టంతో సంచ‌ల‌న విజ‌యం న‌మోదు అవుతుందా? అన్న భావ‌న క‌లిగింది.

అయితే.. ఆరువేల ఓట్లు వెనుక‌బ‌డిన విజ‌య్ రూపానీ త‌ర్వాతి రౌండ్ల‌లో కోలుకోవ‌ట‌మే కాదు.. ప్ర‌త్య‌ర్థిపై ఏకంగా 21వేల ఓట్లు అధిక్యంతో విజ‌యం సాధించ‌టం గ‌మ‌నార్హం. విజ‌య్ రూపానీ విజ‌యంతో బీజేపీ నేత‌లు ఊపిరిపీల్చుకున్నారు. గ‌డిచిన 32 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటలా ఉన్న రాజ్ కోట్ వెస్ట్ కు హార్దిక్ పుణ్య‌మా అని బీట‌లు వార‌తాయేమోన‌న్న భావ‌న క‌లిగిన‌ప్ప‌టికీ.. త‌మ‌కున్న ప‌ట్టును నిలుపుకోవ‌టంలో క‌మ‌ల‌నాథులు స‌క్సెస్ అయ్యారు. దీంతో.. మ‌రో ఐదేళ్లు క‌మ‌ల‌నాథుల‌దే రాజ్ కోట్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.