Begin typing your search above and press return to search.

మోడీజీ.. గుజరాత్ లో ఈ విషయం విన్నారా?

By:  Tupaki Desk   |   20 Aug 2016 4:30 AM GMT
మోడీజీ.. గుజరాత్ లో ఈ విషయం విన్నారా?
X
మోడీ సొంతరాష్ట్రం గుజరాత్ లో దళితులపై జరుగుతున్న దాడులు రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచపటంపై భారతదేశానికి ప్రత్యేక స్థానం కల్పిస్తానని చెబుతున్న మోడీ.. తన సొంత రాష్ట్రంలో దళితులను మనుష్యులుగా చూడలేకపోతున్నా విషయాన్ని గమనించలేకపోతున్నారా లేక మాట్లాడలేకపోతున్నారనా అనే విమర్శలు వెళ్లువెత్తుతున్న తరుణంలో.. తాజాగా ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. నలుగురు దళితులను కారుకు కట్టేసి చితక్కొట్టిన సంఘటనతో గుజరాత్ దళితులు సంఘటితమై హిందూమతాన్ని వదలడానికి సిద్ధమయ్యారు. హిందూమత సంరక్షనే ముఖ్యమని - హిందూమత ఉద్దరణే ప్రాముఖ్యమని - హిందుస్థాన్ జిందాబాద్ అంటే చాలని - హిందూమతానికి కుల గజ్జి లేదని తమ ఊకదంపుడు ఉపన్యాశాల ద్వారా చెప్పే చాలా మందికి ఇది చేదువార్తే!

దళితులపై ఎక్కువగా దాడులు ఈ మధ్యకాలంలో గుజరాత్ వేదికగా జరుగుతున్నాయనే విమర్శ వినిపిస్తున్న నేపథ్యంలో.. బౌద్ధమతాన్ని స్వీకరించేందుకు సిద్ధమయ్యారు గుజరాత్ లోని దళితులు. అలా 60వేల మంది హిందూమతాన్ని వదలి - బౌద్ధమతాన్ని స్వీకరించేందుకు సిద్ధంకాగా ఇప్పటికే 50 వేల మంది తమ దరఖాస్తులను గుజరాత్ దళిత్ సంఘటన్‌ కు సమర్పించారు. అధికారులు అనుమతిచ్చినా - ఇవ్వకపోయినా తమ మతమార్పిడి కార్యక్రమం కొనసాగుతుందని గట్టిగా చెబుతున్నారు. మతం మారాలనుకున్న వాళ్లు ముందస్తుగా జిల్లా అధికార యంత్రాంగం నుంచి అనుమతి తీసుకోవాలంటూ 2009లో గుజరాత్ ప్రభుత్వం మతస్వేచ్ఛా చట్టంలో సవరణలు తీసుకొచ్చింది. అయినా కూడా 2013లో సౌరాష్ట్ర దళిత సంఘటన ఆధ్వర్యంలో దాదాపు లక్ష మందికి పైగా దళితులు హిందూమతాన్ని వదిలిపెట్టి బౌద్ధమతాన్ని స్వీకరించారు. ఇప్పుడు కూడా సౌరాష్ట్ర నుంచే ఎక్కువ మంది దళితులు మతం మారేందుకు ముందుకువచ్చారు.

అగ్రవర్ణాల ఆగడాలు భరించడం, గో సంరక్షకుల నుంచి ఎదురవుతున్న దాడులను తట్టుకోవడం కన్నా తమకు మతం మారడమే మంచిదని మతం మార్చుకోవడానికి సిద్ధపడుతున్న వారు చెబుతున్నారు. బౌద్ధం కాకపోతే.. ముస్లిం - అదీ కాకపోతే మరేదైనా మతంలోకి మారేందుకు కూడా తమకు అభ్యంతరం లేదని చెబుతున్న వీరు గుజరాత్‌ లోని అగ్రవర్ణాల వారు ఈ రోజుల్లో కూడా తమను అంటరానివారు గానే చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రధాని మోడీవరకూ ఈ విషయాలు చేరాలని.. ఈ విషయాలు తెలుసుకున్న ఆయన అనుకోని పరిస్థితుల్లో తేలుకుట్టినట్లు మౌనంగా ఉండకుండా.. దేశ ప్రధానిలా స్పందించాలని ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారు.