Begin typing your search above and press return to search.

గుజ‌రాత్‌ లో వీడియో క‌ల‌కం!... కార‌కులెవ‌రు!

By:  Tupaki Desk   |   19 Nov 2017 9:47 AM GMT
గుజ‌రాత్‌ లో వీడియో క‌ల‌కం!... కార‌కులెవ‌రు!
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాల సొంత రాష్ట్రం గుజ‌రాత్ అసెంబ్లీకి జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌కు సంబంధించి రోజుకో కొత్త అంశం తెరపైకి వ‌స్తోంది. త‌న‌దైన శైలితో ఆ రాష్ట్రంలో వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాలు బీజేపీకి విజ‌యం సాధించిపెట్టిన న‌రేంద్ర మోదీ... మొన్న‌టి సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు ఎన్డీఏ ప్ర‌ధానమంత్రి అభ్య‌ర్థిగా రంగంలోకి దిగిపోయారు. ఆ త‌ర్వాత ప్ర‌ధానిగా విజ‌యం సాధించిన మోదీ... గుజ‌రాత్ నుంచి కేంద్రానికి షిఫ్ట్ అయిపోయారు. ఆ త‌ర్వాత మోదీ స్థానంలో ఆనందీబెన్ ప‌టేల్‌ - ఆ త‌ర్వాత ఇప్పుడు విజ‌య్ రూపానీలు గుజ‌రాత్ సీఎంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. ఇప్ప‌టిదాకా బాగానే ఉన్నా... ప్ర‌ధానిగా త‌న సొంత రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేక‌పోతే ఎలా? ఇదే అంశం ఇప్పుడు గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో హాట్ టాపిక్‌ గా మారిపోయింది.

సొంత ఇలాకాలో ఓడిపోతే ఎలాగ‌ని ఇటు అధికార ప‌క్షంతో పాటు... మోదీపై ఆయ‌న సొంత రాష్ట్రంలోనే జెండా ఎగుర‌వేద్దాం అన్న రీతిలో కాంగ్రెస్ పార్టీ వ్యూహ ప్ర‌తివ్యూహాలు ప‌న్నుతున్నాయి. ఈ క్ర‌మంలో అక్క‌డ హోరాహోరీ ప్ర‌చారం సాగుతోంది. మొన్న‌టిదాకా అంత‌గా ప్ర‌భావం చూప‌లేని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ గుజ‌రాత్ ఎన్నిక‌ల పుణ్య‌మా అని ప‌రిణ‌తి చెందిన రాజ‌కీయ వేత్త‌గా కొత్త అవ‌తారం ఎత్తారు. రాహుల్‌ లో క‌నిపిస్తున్న ఈ ప‌రిణ‌తి... ఆయ‌న స‌భ‌లు - స‌మావేశాల‌కు భారీ ఎత్తున జ‌నాన్ని ఆక‌ర్షిస్తోంది. దీంతో అల‌ర్ట్ అయిపోయిన బీజేపీ కూడా త‌న‌దైన శైలి వ్యూహాల‌ను అమ‌లు చేస్తోంది.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయ‌న‌గా... ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిచ్చిన ఓ వీడియో అక్క‌డ ప‌ద్ద వివాదానికే తెర తీసేలా క‌నిపిస్తోంది. అయినా స‌ద‌రు వీడియోలో ఏముందున్న విష‌యానికి వస్తే... ఓ అమ్మాయి రాత్రి 7 గంటల సమయంలో ఒంటరిగా ఇంటికి వెళ్తూ కనిపిస్తుంది. ఇంతలో అజాన్‌(మసీదు నుంచి వచ్చే ప్రార్థన గీతం) మొదలవ్వగానే యువతి భయం భయంగా ముందుకు వెళ్తుంది. ఇంట్లో ఆమె కోసం తల్లిదండ్రులు కంగారుపడుతూ కనిపిస్తారు. చివరకు ఆమె ఇంటికి చేరటంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. *ఇదసలు గుజరాతేనా?* అని తల్లి అంటే.. *ఇది 22 ఏళ్ల క్రితం గుజరాత్‌. మళ్లీ వాళ్లు అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి* అని తండ్రి చెబుతాడు. చివరకు కూతురు.. *కంగారు పడాల్సిన పనిలేదు. ఇక్కడ మోదీ ఉండగా ఎవరూ రారు. భయపడాల్సిన అవసరం లేదు*... అంటూ వీడియో ముగుస్తుంది. 75 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో బీజేపీకి అనుకూలంగా ఉంద‌రి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా 22 ఏళ్ల క్రితం కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉన్న విషయం విదితమే.

అయితే ఈ వీడియోలో అజాన్‌ వినిపించటం.. ఖచ్ఛితంగా ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని.. తక్షణం దానిని నిషేధించాల్సిన అవసరం ఉందని గోవింద్‌ పర్మర్‌ అనే వ్యక్తి ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి బీబీ స్వెయిన్‌ - అహ్మదాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ సెల్‌ ను విచారణకు ఆదేశించారు. అయితే వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో అన్వేషించే బదులు.. అందులో నటించిన నటులను విచారిస్తే ఈ వీడియో వెనక ఉంది ఎవరో తెలిసిపోతుందని గోవింద్‌ పోలీసులకు సూచిస్తున్నారు. ఏదేమైనా... ఈ వీడియో ఇప్పుడు గుజ‌రాత్‌ లో ఎన్నిక‌ల వేడిని తారాస్థాయికి చేరుస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌నే చెప్పాలి. ఇదిలా ఉంటే.. అస‌లు ఈ వీడియో వెనుక ఎవ‌రున్నార‌న్న అంశంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు బీజేపీనే ఈ వీడియోను విడుద‌ల చేసి ఉంటుంద‌ని కొందరంటుంటే... కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగానే దీనిని విడుద‌ల చేసి ఉంటుంద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మ‌రి ఈసీ విచార‌ణ‌లో ఏం తేలుతుందో చూడాలి.