Begin typing your search above and press return to search.

జంపింగ్‌ ల‌కు గుజ‌రాత్ షాక్‌..

By:  Tupaki Desk   |   22 Dec 2017 9:17 AM GMT
జంపింగ్‌ ల‌కు గుజ‌రాత్ షాక్‌..
X
క‌న్న‌త‌ల్లికి ద్రోహం చేసినోళ్లు బాగుప‌డే ఛాన్స్ ఉండ‌నే ఉండ‌దు. టైం బాగుండి ద్రోహం చేసే నాటికి అంతా బాగానే ఉన్న‌ట్లు క‌నిపించినా.. ప‌డాల్సిన టైంలో దెబ్బ ప‌డ‌టం ఖాయం. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జంపింగ్స్ ప‌రిస్థితి ఇప్పుడు ఇదే తీరులో ఉంది. స్వ‌ల్పకాలిక ప్ర‌యోజ‌నం కోసం క‌న్న‌త‌ల్లి లాంటి పార్టీని వ‌దిలేసి.. తాయిలాలు..ప‌ద‌వుల ఆశ‌తో జంప్ అయిన వారికి రానున్న‌దంతా గ‌డ్డు కాల‌మేన‌ని చెబుతున్నారు.

తాజాగా వెలువ‌డిన గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జంపింగ్స్‌ కు ఏ మాత్రం క‌లిసి రాలేద‌న్న విష‌యం ఎన్నిక‌ల ప‌లితాల వెల్ల‌డిని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతోంది. విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇచ్చి పార్టీ మారిన వారికి చెప్పుతో కొట్టిన‌ట్లుగా ఓట‌మిని ఇచ్చిన నేప‌థ్యంలో.. గుజ‌రాత్ ఎఫెక్ట్ త‌మ మీద ప‌డుతుంద‌న్న భ‌యాందోళ‌న‌లు ఇప్పుడు తెలుగునాట జంపింగ్స్ గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తేలా చేస్తోంది.

ఇంత‌కీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని జంపింగ్స్‌ కు గుజ‌రాత్‌ కు లింకేమిటంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. ఇటు ఏపీ కావొచ్చు.. అటు తెలంగాణ కావొచ్చు. రెండు చోట్ల విప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల్ని.. ఎంపీల‌ను తాత్కాలిక తాయిలాలు చూపించి అధికార పార్టీలోకి వెల్ కం చెప్పేశారు. దీనికి తాయిలాల ఆశ‌తో వెనుకా ముందు చూసుకోకుండా.. ఫ్యూచ‌ర్ ఆలోచించ‌కుండా.. విలువ‌లు వ‌దిలేసి ఎంచ‌క్కా పార్టీ మారేశారు. పార్టీ మారిన సంద‌ర్భంలో జంపింగ్స్‌ కు రెండు ర‌కాల ఆఫ‌ర్ల‌తో పార్టీలో చేర్చుకున్నారు.

సొంత పార్టీకి షాకిచ్చి పార్టీలో చేరినందుకు వెనువెంట‌నే ప్ర‌యోజ‌నం క‌లిగించేలా ప్యాకేజీ.. ఇందులో ప్ర‌భుత్వ ప‌నులు ద‌గ్గ‌ర నుంచి.. ప‌దవుల వ‌ర‌కూ ఉంటాయి. ఇక‌.. రెండోది లాంగ్ ట‌ర్మ్ క‌మిట్ మెంట్‌. అదేమంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వారు కోరుకున్న చోట టికెట్ ఇవ్వ‌టం. లేదంటే.. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు సంద‌ర్భంగా వారికి ఇబ్బంది లేని చోట టికెట్ ఇచ్చే ఒప్పందం మీద చాలామంది ఎమ్మెల్యేల్ని..ఎంపీల‌ను అధికార పార్టీ లాగేసుకుంది.

కానీ.. అస‌లు గేమ్ ప్లాన్ ఏమిటంటే.. ఒక‌సారి పార్టీలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఎన్నిక‌ల వేళ‌లో.. ఇలాంటి క‌మిట్ మెంట్లు అన్ని నీళ్ల మూట‌లేన‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. టికెట్ ఇవ్వాల‌నుకున్నా... కానీ ప‌రిస్థితులు స‌హ‌క‌రించ‌టం లేదు.. పార్టీ గెల‌వ‌టం ముఖ్యం కానీ.. మీ టికెట్ కాదు క‌దా. రేపొద్దున పార్టీ గెలిచిన త‌ర్వాత మీకు ప‌ద‌వులు ఇస్తాన‌న్న మాట చెబితే.. అప్ప‌టికి ఏమీ స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. ఈ లాజిక్ మిస్ అయిన చాలామంది నేత‌లు తాత్కాలిక ప్ర‌యోజ‌నంలో భాగంగా పార్టీ మారిపోయారు.

ఇదిలా ఉంటే.. జంపింగ్స్‌కు గుజ‌రాత్ ఎన్నిక‌ల రిజల్ట్ కు లింకేమిట‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. ఈ విష‌యానికి వ‌స్తే.. మ‌న తెలుగు రాష్ట్రాల్లో మాదిరే గుజ‌రాత్ లో నాన్ స్టాప్ గా 22 ఏళ్ల నుంచి ప‌వ‌ర్ లో ఉన్న బీజేపీ సైతం.. విప‌క్ష పార్టీల‌కు గాలం వేసింది. నాన్ స్టాప్ గా రెండు ద‌శాబ్దాల‌కు పైగా ప‌వ‌ర్ లో ఉన్న‌ప్పుడు స‌హ‌జంగా ఉండే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను అధిగ‌మించేందుకు జంపింగ్స్ ను ప్రోత్స‌హించింది. బీజేపీ గాలానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు చిక్కారు. తొలుత క్రాస్ ఓటింగ్‌ కు పాల్ప‌డ్డ వీరంతా త‌ర్వాతి కాలంలో బీజేపీలోకి చేరారు.

ఎప్ప‌టిలానే తాయిలాల‌తో పార్టీ మారిన వారికి.. ఎన్నిక‌ల స‌మ‌యానికి హ్యాండ్ ఇచ్చేసింది బీజేపీ. మొత్తం 14 మంది జంపింగ్ సిట్టింగ్స్ లో కేవ‌లం ఆరుగురికి మాత్ర‌మే టికెట్లు ఇచ్చింది. ఈ ఆరుగురిలో కేవ‌లం ఒక్క‌రిని మాత్ర‌మే ఓట‌ర్లు గెలిపించారు. మిగిలిన ఐదుగురిని ఓడించి ప్ర‌జాకోర్టులో శిక్ష ఖ‌రారు చేశారు. తాత్కాలిక ప్ర‌యోజ‌నాల కోసం ప‌క్క‌దారి ప‌ట్టిన ఎమ్మెల్యేల రాజ‌కీయ జీవితం ఇప్పుడు చిక్కుల్లో ప‌డిన ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. గుజ‌రాత్ లో మాదిరే తెలుగు రాష్ట్రాల్లో జ‌రుగుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. జంపింగ్స్ కు ప్ర‌జ‌ల్లో ఉండే వ్య‌తిరేక‌త నేప‌థ్యంలో.. గుజ‌రాత్ అనుభ‌వాన్ని దృష్టిలో పెట్టుకొని టికెట్ల కేటాయింపు విష‌యంలో హ్యాండ్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. మ‌రోవైపు.. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు విష‌యంలోనూ కేంద్రం సానుకూలంగా లేద‌న్న మాట వినిపిస్తోంది. ఏతావాతా జంపింగ్స్‌ కు గ‌డ్డుకాల‌మేన‌న్న అభిప్రాయం ప‌లువురి నోట వినిపిస్తోంది.