Begin typing your search above and press return to search.

గుజరాత్‌ ఎన్నికలు.. బీజేపీ సృష్టించిన రికార్డులివే!

By:  Tupaki Desk   |   8 Dec 2022 8:30 AM GMT
గుజరాత్‌ ఎన్నికలు.. బీజేపీ సృష్టించిన రికార్డులివే!
X
గుజరాత్‌లో వరుసగా ఏడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాల ఇలాకా అయిన గుజరాత్‌లో తమను ఓడించడం ఎవరి వల్లా కాదని బీజేపీ మరోసారి నిరూపించింది. ఏకంగా 150కి పైగా స్థానాలతో బీజేపీ చరిత్ర సృష్టించబోతోంది.

మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్‌ అసెంబ్లీలో బీజేపీ ఇప్పటికే 113 స్థానాల్లో గెలుపొంది సులువుగా మెజారిటీ మార్కు (92)ని దాటేసింది. మరో 43 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అంటే బీజేపీ 150 సీట్లను గెలుపొందడం పక్కా అని స్పష్టమైపోతోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీగా రికార్డు సృష్టించింది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున మాధవ్‌ సింహ్‌ సోలంకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 149 స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ రికార్డు బద్దలు కానుంది. బీజేపీ ఖాతాలో ఈ రికార్డు చేరబోతోంది.

అలాగే 1995లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ అప్పటి నుంచి ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీట్ల సంఖ్యనూ పెంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో 1995లో 121, 1998లో 117, 2002లో 127, 2007లో 117, 2012లో 115, 2017లో 99 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు 2022లో ఏకంగా 150కి పైగా స్థానాలతో చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది.

వాస్తవానికి 2002లో జరిగిన గోద్రా అల్లర్ల తర్వాత నుంచి బీజేపీ ఆధిక్యం తగ్గుతూ వచ్చింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాలకే బీజేపీ పరిమితమైంది. ఈసారి కాంగ్రెస్‌కు తోడు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా రంగంలో ఉండటంతో బీజేపీ గెలుపు కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే పకడ్బందీ వ్యూహంతో కదిలిన కమల దళం ఎలాంటి సంచలనాలకు తావు ఇవ్వకుండా ఘనవిజయం సాధించింది.

2002 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్యధికంగా 127 స్థానాలు వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డును బద్దలుకొడుతూ 150కి పైగా స్థానాల్లో గెలుపు లక్ష్యంగా దూసుకుపోతోంది.

అలాగే గుజరాత్‌లో గత ఆరు పర్యాయాలుగా బీజేపీనే అధికారంలో ఉంది. ఇప్పుడు ఏడోసారి కూడా అధికారం సాధించింది. దీంతో మరో రికార్డును బీజేపీ తన ఖాతాలో వేసుకోనుంది.

ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఏడోసారి ఒకే పార్టీ విజయం సాధించడం దేశంలో ఇది రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. అంతకుముందు పశ్చిమ బెంగాల్‌ను సీపీఎం వరుసగా 34 ఏళ్ల పాటు (1977 నుంచి 2011 వరకు) పాలించింది. ఆ తర్వాత వరుసగా ఏడుసార్లు విజయం సాధించిన ఏకైక పార్టీగా బీజేపీ రికార్డు సాధించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.