Begin typing your search above and press return to search.

మోడీకి షాకిచ్చిన గుజ‌రాతీలు

By:  Tupaki Desk   |   18 Dec 2017 5:51 AM GMT
మోడీకి షాకిచ్చిన గుజ‌రాతీలు
X
గుజ‌రాత్ అంటే మోడీనే. వేరే మాటే లేదు. గుజ‌రాత్ ప్ర‌స్తావ‌న వ‌చ్చిన ప్ర‌తిసారీ మోడీ మాట లేకుండా ఒక్క‌మాట ముందుకు పోని ప‌రిస్థితి. రెండు ద‌శాబ్దాలుగా సాగుతున్న ఈ హ‌వాకు తొలిసారి బ్రేక్ ప‌డింది. అలా అని గుజ‌రాతీయులు త‌మ అరాధ్య‌దైవం మోడీని ఇంకా విశ్వ‌సిస్తూనే ఉన్నారు. సాంకేతికంగా గెలుపును అందిస్తూనే.. త‌మ‌కున్న కోపాన్ని.. అస‌హ‌నాన్ని.. అసంతృప్తిని ఓటుతో చెప్పేశారు.

గెలుపు ఆనందం ద‌క్క‌కుండా చేయ‌ట‌మే కాదు.. మోడీ అండ్ కోకు ఓట‌మి భ‌యాన్ని క‌లిగించ‌టంలో స‌క్సెస్ అయ్యారు. గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల స‌ర‌ళి చూసినంత‌నే మ‌న‌సుకు అనిపించే అంశాలివే. తిరుగులేని విజ‌యంతో దూసుకెళ‌తామ‌ని చెప్పుకున్న బీజేపీ నేత‌ల నోట మాట రాకుండా గుజ‌రాత్ ఫ‌లితాలు వెల్ల‌డ‌వుతున్నాయి.

ఈ ఆర్టిక‌ల్ రాస్తున్న స‌మ‌యానికి (ఉదయం 11 గంట‌ల వేళ‌కు) మొత్తం 182 స్థానాల్లో గెలుపు.. అధిక్య‌త‌ను చూస్తే.. బీజేపీ 94 స్థానాల్లోఆధిక్యం 10స్థానాల్లో గెలుపు .. కాంగ్రెస్ 72 ఆధిక్యం 2 స్థానాల్లో గెలుపు - 3 స్థానాల్లో స్వ‌తంత్య్ర అభ్య‌ర్థులు ముందంజ‌లో ఉన్నారు. ఇప్పుడు అంకెల్ని చూసిన‌ప్పుడు గుజ‌రాత్ లో బీజేపీ అధికారంలో రానుంద‌న్న‌ది క‌న్ఫ‌ర్మ్ అయిన‌ప్ప‌టికీ.. రెండు పార్టీల‌కు మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసం త‌క్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం.

మేజిక్ ఫిగ‌ర్ 92 స్థానాల‌కు కేవ‌లం 11 సీట్లు మాత్ర‌మే అధిక్య‌త‌లో ఉన్న వైనాన్ని చూస్తే.. బీజేపీపై గుజ‌రాతీల న‌మ్మ‌కం అంత‌కంత‌కూ త‌గ్గుతుంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. గుజ‌రాత్ రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా చూస్తే.. మ‌ధ్య.. ద‌క్షిణ గుజ‌రాత్ ల‌లో ఓట‌ర్లు బీజేపీ ప‌ట్ల సానుకూలంగా వ్య‌వ‌హ‌రించగా.. సౌరాష్ట్ర- క‌చ్ ప్రాంతంలో బీజేపీని విస్ప‌ష్టంగా తిర‌స్క‌రించారు. ఇక‌.. ఉత్త‌ర గుజ‌రాత్ లో రెండు పార్టీల మ‌ధ్య పోటాపోటీ న‌డుస్తోంది. బీజేపీ మేజిక్ మార్క్ సాధిస్తుందంటే అది కేవ‌లం మ‌ధ్య‌.. ద‌క్షిణ గుజ‌రాత్ పుణ్య‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

మ‌ధ్య గుజ‌రాత్ లో మొత్తం 61 స్థానాల్లో క‌డ‌ప‌టి స‌మాచారం ప్ర‌కారం బీజేపీ 44 స్థానాల్లో అధిక్య‌త‌లో ఉండ‌గా.. కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షాలు 17 స్థానాల్లో ముందంజ‌లో ఉన్నాయి. ఉత్త‌ర గుజ‌రాత్ లో మొత్తం 32స్థానాల‌కు బీజేపీ 16 స్థానాల్లో అధిక్య‌త‌లో ఉండగా.. కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షాలు 15 స్థానాల్లో ఇత‌రులు ఒక స్థానంలో ముందంజ‌లో ఉన్నారు . సౌరాష్ట్ర- క‌చ్ లో బీజేపీకి దారుణ ప‌రాభ‌వం ఎదురైంది. ఇక్క‌డ మొత్తం 54 స్థానాలుంటే బీజేపీ కేవ‌లం 19 స్థానాల్లో మాత్ర‌మే ముందంజ‌లో ఉంటే.. కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షాలు 33 స్థానాల్లో అధిక్యంలో ఉన్నారు. ఇత‌రులు రెండు స్థానాల్లో ముందంజ‌లో ఉన్నారు. ఇక‌.. ద‌క్షిణ గుజ‌రాత్ లో బీజేపీ అభ్య‌ర్థులు 23 స్థానాల్లో ముందంజ‌లో ఉండ‌గా.. కాంగ్రెస్ 11 స్థానాల్లో అధిక్యంలో ఉంది. ఇత‌రులు ఒక్క స్థానంలో అధిక్య‌త‌లో ఉన్నారు. మొత్తంగా చూస్తే.. మోడీ మీద త‌మ‌కు అభిమానం ఉన్న‌ప్ప‌టికీ.. పాల‌న ప‌రంగా ఆయ‌న మీదున్న అసంతృప్తిని గుజ‌రాతీలు త‌మ ఓటుతో చెప్పేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.