Begin typing your search above and press return to search.

గుజరాత్ టైటాన్స్.. అది జట్టు కాదు.. జెయింట్ కిల్లర్

By:  Tupaki Desk   |   30 May 2022 6:29 AM GMT
గుజరాత్ టైటాన్స్.. అది జట్టు కాదు.. జెయింట్ కిల్లర్
X
అసలే మాత్రం అంచనాల్లేకుండా వచ్చి.. అందరి లెక్కలను తలకిందులు చేస్తూ గుజరాత్ టైటాన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ టైటిల్ నెగ్గింది. ఇది మామూలు విజయం కాదు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యద్భుతంగా చెప్పొచ్చు. ఎప్పుడో రాజస్థాన్ రాయల్స్ 2008లో టైటిల్ కొట్టి అందరినీ ఆశ్చర్యపర్చింది. అయితే అది తొలి సీజన్. అప్పటికింకా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ దిగ్గజ జట్లుగా ఎదగలేదు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పుంజుకోలేదు. హైదరాబాద్ (సన్ రైజర్స్) మేటి జట్టుగా పేరొందలేదు. కోల్ కతా నైట్ రైడర్స్ నామమాత్రంగానే ఉంది. కానీ, ఈ జట్లలో ఉన్నది ఏమంటే.. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్లున్నారు. నాడు రాజస్థాన్ రాయల్స్ లో మాత్రం షేన్ వార్న్ మినహా పెద్ద స్టార్లు ఎవరూ లేరు. అందుకే 2008లో రాజస్థాన్ రాయల్స్ సాధించిన విజయం గొప్పదిగా నిలిచింది.

గుజరాత్ గెలుపు ఎందుకు ప్రత్యేకం..?ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్. ఆ జట్టులో ఇంకా సూర్యకుమార్ యాదవ్ వంటి బ్యాట్స్ మన్ ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్లున్నారు. కీరన్ పొలార్డ్ వంటి ఆల్ రౌండర్లున్నారు. చెన్నైకి ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా వంటి స్టార్లున్నారు. బెంగళూరుకు కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్ వెల్ వంటి ఆటగాళ్లున్నారు. ఇంకా మిగతా అన్ని జట్లకు హిట్టర్లు, భీకర బౌలర్లున్నారు. కానీ, గుజరాత్ కు మాత్రం వారెవరూ లేరు. హార్దిక్ పాండ్యా.. డేవిడ్ మిల్లర్, శుబ్ మన్ గిల్, సాహా, షమీ, రషీద్ ఖాన్, తెవాతియా.. ఇదీ వారి జట్టు. పాండ్యా గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఓ మ్యాచ్ ఆడలేదు కూడా. గిల్ ఇంకా కుర్రాడే. మిల్లర్ ను వేలంలో ఏ జట్టూ కొనలేదు. సాహాదీ అదే పరిస్థితి. ఇతర ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో మిల్లర్, సాహాను గుజరాత్ తీసుకుంది. చిత్రమేమంటే సాహా రెగ్యులర్ కీపర్. ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ వేడ్ కూడా కీపరే. సాధారణంగా ఇద్దరిలో ఒకరిని ఆడిస్తే సరిపోతుంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరినీ ఆడించింది గుజరాత్. దీన్నిబట్టే ఆ జట్టు ఏ స్థితిలో ఉందో తెలిసిపోతోంది. ఇక బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్ మాత్రమే ప్రస్తుతం ఫామ్ లో ఉన్నారు. ఇలాంటి జట్టుతోనే హార్దిక్ విజయం సాధించాడు. అందుకే గుజరాత్ విజయం ఇంత గొప్పది.

హార్దిక్ పరిణతి.. గుజరాత్ ఉన్నతి హార్దిక్‌ పాండ్య 2019 ఆసియా కప్‌ తర్వాత వెన్నునొప్పి కారణంగా కొంత కాలం టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. శస్త్రచికిత్స అనంతరం కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తర్వాత మళ్లీ క్రికెట్‌ మైదానంలో కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా గుజరాత్‌ కెప్టెన్‌గా అడుగుపెట్టాడు. తొలి సీజన్‌లోనే జట్టును విజేతగా నిలిపాడు. ముక్కుసూటితనం మరీ ఎక్కువ హార్దిక్‌లో. మైదానంలోనూ యాటిట్యూడ్ తో విమర్శలకు గురయ్యాడు. జట్టులో సమస్యలు ఎదుర్కొన్నాడు. తర్వాత ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాడు. అదే ఇప్పుడు కలిసొచ్చింది. ఆ సీజన్‌లో పూర్తి భిన్నంగా కనిపించాడు. ఆటగాళ్లు తప్పు చేస్తే దగ్గరికెళ్లి మాట్లాడడ, నిరంతరం బౌలర్లకు అందుబాటులో ఉంటూ విలువైన సూచనలు చేయడం గుజరాత్‌కు కలిసొచ్చింది.

ఆల్ రౌండర్ గా గుజరాత్ జట్టుకు హార్దిక్ తప్ప మరో పెద్ద ఆల్ రౌండర్ లేడు. ఇలాంటి సమయంలో పాండ్య బ్యాట్స్‌మన్‌గా, ఇటు బౌలర్‌గా సేవలు అందించాడు. బ్యాటింగ్ ఆర్డర్‌ను ముందుకు తెచ్చుకొని 15 మ్యాచ్‌ల్లో 487 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. గుజరాత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌ ఇతడే. నాలుగు అర్ధ
శతకాలతో పాటు 44.27 సగటు, 131.26 స్ట్రైక్‌రేట్‌. ఫైనల్లో బంతితో రాజస్థాన్‌ జట్టులోని కీలక ఆటగాళ్లు జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, షిమ్రన్‌ హెట్‌మెయర్‌లను ఔట్‌ చేశాడు. 4
ఓవర్లల 17 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌లోనూ పాండ్య (34; 30 బంతుల్లో 3x4, 1x6) మెరిశాడు.

ఆటగాళ్లపై నమ్మకం ఉంచి..ఈ సీజన్‌లో గుజరాత్‌ అంత సమష్టిగా రాణించిన జట్టు ఏదీ లేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఏమాత్రం అంచనాల్లేని జట్టుగా అడుగుపెట్టి.. ఇద్దరు, ముగ్గురు స్టార్లతోనే బరిలోకి దిగి మేటి జట్లను ఓడించి సంచలన విజయాలు సాధించాడు. అందుకు ప్రధాన కారణం తన ఆటగాళ్లపై పాండ్య పెట్టుకున్న నమ్మకమే. అతడు సమయోచితంగా నాయకత్వం చేస్తూనే తనపై పనిభారం పెరిగినప్పుడు పలు మ్యాచ్‌ల్లో బౌలింగ్‌కు దూరమయ్యాడు.

యశ్‌ దయాల్‌, సాయి కిషోర్‌ వంటి యువకులకు అవకాశాలు కల్పించాడు. వారు రాణించారు. కెప్టెన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ ఇతర ఆటగాళ్లు కూడా మెరిశారు. అందుకు నిదర్శనమే రాహుల్‌ తెవాతియా, డేవిడ్‌ మిల్లర్‌, వృద్ధిమాన్‌ సాహా, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ షమి, లాకీ ఫెర్గూసన్‌. వీళ్లంతా ఒకరు కాకపోయినా మరొకరు అన్నట్లు ప్రతి మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్టు ఆడారు. దీంతో పాండ్య తన ఆటగాళ్ల నమ్మకాన్ని గెలుచుకున్నాడు.

మళ్లీ ఇప్పుడు 2008 తర్వాత అనేక జట్లు టైటిల్ గెలిచాయి.. రాజస్థాన్ తప్ప. మళ్లీ ఆ అవకాశం ఆ జట్టుకు దక్కింది. కానీ, గుజరాత్ దానిని దక్కనీయలేదు. ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో గుజరాత్‌ ఘన విజయం సాధించి టైటిల్‌ని ముద్దాడింది. తొలుత రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేసింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 3 వికెట్లను మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలోనే ఛేదించింది.

గుజరాత్‌ బ్యాటర్లలో శుభమన్‌ గిల్‌ (45*; 43 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్ పాండ్య (34), డేవిడ్ మిల్లర్‌ (32*) రాణించగా.. సాహా (5), వేడ్ (8) విఫలమయ్యారు. ఇక రాజస్థాన్‌ జట్టులో బట్లర్ (39) రాణించకపోతే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. రాజస్థాన్‌ మిగిలిన బ్యాటర్లలో యశస్వీ జైస్వా్ల్‌ (22) ఫర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్‌ (14), దేవదత్‌ పడిక్కల్ (2), హెట్‌మెయర్‌ (11), అశ్విన్ (6), ట్రెంట్ బౌల్ట్‌ (11), రియాన్ పరాగ్ (15), మెకాయ్ (8) పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో హార్దిక్ పాండ్య మూడు వికెట్లతో మెరవగా.. సాయికిశోర్‌ రెండు, రషీద్‌ఖాన్‌, యశ్ దయాళ్‌, షమి తలో వికెట్‌ పడగొట్టారు. రాజస్థాన్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ (863) పరుగులతో ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా, రాజస్థాన్‌ బౌలర్‌ యుజువేంద్ర చాహల్‌ (27) వికెట్లతో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్‌గా నిలిచారు.