Begin typing your search above and press return to search.

11 నిమిషాల్లో 19 అంతస్తుల భవనం నేలమట్టం..ఎందుకంటే!

By:  Tupaki Desk   |   11 Jan 2020 11:57 AM GMT
11 నిమిషాల్లో 19 అంతస్తుల భవనం నేలమట్టం..ఎందుకంటే!
X
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలపై కేరళ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. నిబంధనలు ఉల్లంఘించి కోచిలోని మారడు ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టిన రెండు భారీ భవనాలను శనివారం ఉదయం నేలమట్టం చేశారు. ఇందుకోసం వందల కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారు. మారడు మున్సిపాలిటీలోని హెచ్‌20 హోలీ ఫేత్‌, ఆల్ఫా అపార్ట్‌ మెంట్‌ లను నేడు కూల్చివేశారు.

తొలుత హెచ్‌20 హోలీ ఫేత్‌ అపార్ట్‌ మెంట్‌ ను 11.18 నిమిషాలను కూల్చారు. కేవలం సెకన్ల వ్యవధిలోనే భవనం నేలమట్టమైంది. ఆ తర్వాత కాసేపటికే ఆల్ఫా కాంప్లెక్స్‌ ను కూల్చారు. కూల్చివేతకు ముందు అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పొరుగున్న ఉన్న భవనాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా వీటిని నేలమట్టం చేశారు. అంతేగాక.. కూల్చివేత సమయంలో ప్రజలెవరూ అటు పక్కకు రాకుండా ఆంక్షలు విధించారు.

19 అంతస్తుల హెచ్‌20 హోలీ ఫేత్‌ అపార్ట్‌ మెంట్‌ లో 91 ఫ్లాట్లు ఉన్నాయి. 200 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు ఉపయోగించి దీన్ని నేలమట్టం చేశారు. 17 అంతస్తుల ఆల్ఫా కాంప్లెక్స్‌ లో 67 ఫ్లాట్లు ఉన్నాయి. తీర ప్రాంత నిబంధనలను ఉల్లంఘించినందుకు సరస్సును ఆనుకుని నిర్మించిన నాలుగు నివాస భవనాలను కూల్చివేయాలని గత సెప్టెంబరులో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో కేరళ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఈ రోజు రెండు భవనాలను నేలమట్టం చేశారు. ఆదివారం మరో రెండు భవనాలను కూల్చనున్నారు.