Begin typing your search above and press return to search.

గులాబ్ గలభాతో సెలవు ఇచ్చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   28 Sep 2021 3:26 AM GMT
గులాబ్ గలభాతో సెలవు ఇచ్చేసిన కేసీఆర్
X
ఏపీలో మొదలైన అల్పపీడటం అంతకంతకూ తీవ్ర రూపం దాల్చటం గులాబ్ తుపానుగా ఫిక్స్ చేయటం తెలిసిందే. ఇప్పటికే దీని ప్రభావం ఎంతన్న విషయాన్ని సోమవారం నాడు తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షాలు స్పష్టం చేశాయి. ఇదే తరహాలో వర్షాలు మరో రెండు రోజులు కొనసాగటమే కాదు.. అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని చెబుతున్నారు. వాతావరణ శాఖ అధికారులు ఇస్తున్న సమాచారంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల్ని తీసుకుంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ రోజు (మంగళవారం) సెలవుగా ప్రకటించారు.

అత్యవసర సర్వీసులైన రెవెన్యూ.. పోలీస్.. అగ్నిమాపక.. పురపాలక.. పంచాయితీ రాజ్.. నీటిపారుదల.. రోడ్లు భవనాల శాఖ ఉద్యోగులకు మాత్రం సెలవు లేదు. మిగిలిన వారికి మాత్రం వర్షాల కారణంగా.. ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సెలవుదినాన్ని ప్రకటించారు.

భారీ వర్షాల కారణంగా ఎలాంటి ఆస్తి.. ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. గత వారం చివర్లో మొదలైన టీ అసెంబ్లీ సమావేశాల్ని సైతం మూడు రోజుల పాటు వాయిదా వేశారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న వేళ.. అసెంబ్లీ సమావేశాల్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సోమవారం సమావేశాల ముగింపు సందర్భంగా ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు పలువురు సభలను వాయిదా వేయాలని కోరారు. దీంతో స్పందించిన అసెంబ్లీ స్పీకర్ పోచారం.. మండలి ఛైర్మన్ భూపాల్ రెడ్డిలు సానుకూలంగా స్పందించారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు వాయిదా నిర్ణయాన్ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.