Begin typing your search above and press return to search.

ఆజాద్ సక్సెస్ అవుతారా ?

By:  Tupaki Desk   |   5 Sept 2022 1:11 PM IST
ఆజాద్ సక్సెస్ అవుతారా ?
X
కాంగ్రెస్ పార్టీలో ఇపుడు గులాంనబీ ఆజాద్ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దశాబ్దాలుగా పార్టీలో, ప్రభుత్వంలో అనేక ఉన్నత పదవులు దక్కించుకుని చివరకు పార్టీకి రాజీనామా చేసిన ఆజాద్ వైఖరిపై పార్టీలో మిశ్రమ స్పందన కనబడుతోంది. పార్టీ నేతల స్పందనలు, ఖండనలు పక్కన పెట్టేస్తే కొత్త పార్టీ పెట్టబోతున్న ఆజాద్ సక్సెస్ రేటు విషయమై మాట్లాడుకుందాం. కొత్త పార్టీ సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు తక్కువని అర్ధమవుతోంది.

దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఆజాద్ వయస్సే. ఈయనకు కాంగ్రెస్ లో వృద్ధ నేతగా గుర్తింపుంది. ఆజాద్ వయసు సుమారు 76 ఏళ్ళు. ఇంత లేటు వయసులో పార్టీ పెట్టడం పెద్ద మైనస్ అవుతుందనే అనుకోవాలి.

పార్టీ పెట్టడం సులభమే కానీ దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళమే చాలా కష్టం. పార్టీ పెట్టిన దగ్గర నుండి ఆజాద్ 24 గంటలూ జనాల్లోనే ఉండాలి. ఇంత పెద్ద వయసులో అంత శ్రమ తీసుకోవటం ఎంతమాత్రం మంచిది కాదు.

ఈ విషయాన్ని ఆజాద్ ఆలోచించకుండానే ఉంటారా ? అంటే కచ్చితంగా ఆలోచించే ఉంటారనటంలో సందేహంలేదు. కాకపోతే అధికార మత్తు ఆయనతో పార్టీ పెట్టేట్లుగా ప్రేరేపించి ఉంటుందని అనుకోవాలి.

పార్టీ పెట్టేయగానే జనాలంతా పోలోమంటు ఓట్లేసి గెలిపిచేస్తారని, వెంటనే ముఖ్యమంత్రి అయిపోవచ్చని మద్దతుదారులు చెప్పటంతోనే ఆజాద్ పార్టీ పెట్టారని అర్ధమవుతోంది. ఇక్కడ సమస్య ఏమిటంటే ఆజాద్ సొంతరాష్ట్రం జమ్మూకాశ్మీర్ అయినా ఆయన దశబ్దాలుగా అక్కడుండి చేసిన రాజకీయం ఏమీలేదు.

ఇపుడు ఆజాద్ కాశ్మీర్ పండిట్లకు పునరావాసం, నివాసితులకు భూ, ఉద్యోగాల కల్పన వంటి హామీలిస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే పండిట్లకోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తామంటున్నారు. మరివన్నీ కేంద్రమంత్రిగా ఉన్నపుడు 2004-14 మధ్యలో ఆజాద్ ఎందుకు చేయలేకపోయారు ? కేంద్రమంత్రిగా ఫెయిలై రేపు అధికారంలోకి వస్తే అన్నీ చేసేస్తానని ఆజాద్ చెబితే ఎవరైనా నమ్ముతారా ? చూద్దాం తన ప్రయోగంలో ఆజాద్ ఎంతవరకు సక్సెస్ అవుతారో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.