Begin typing your search above and press return to search.

సోనియాకు ఆజాద్ షాక్

By:  Tupaki Desk   |   17 Aug 2022 5:34 AM GMT
సోనియాకు ఆజాద్ షాక్
X
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి గులాంనబీ ఆజాద్ పార్టీ చీఫ్ సోనియాగాంధీకి పెద్ద షాక్ ఇచ్చారు. తొందరలో జమ్మూకాశ్మీర్ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు సోనియా ఒక ప్రచారకమిటిని నియమించింది. ఆ కమిటీకి ఆజాద్ ను నాయకత్వం వహించమని చెప్పింది. అయితే ప్రచారకమిటీని నాయకత్వం వహించనని ఆజాద్ చెప్పేశారు. బాధ్యతలను తిరస్కరించినందుకు కారణాలను మాత్రం చెప్పలేదు.

ఇక్కడ విషయం ఏమిటంటే గులాంనబీ ఆజాద్ సొంతరాష్ట్రం జమ్మూకాశ్మీరే. తన సొంతరాష్ట్రంలో జరగబోయే ఎన్నికల ప్రచారకమిటి నాయకత్వ బాధ్యతలను ఎందుకు ఆజాద్ తిరస్కరించారు? ఎందుకంటే దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిదేమో ఆజాద్ మాటకు సొంతరాష్ట్రంలో ఎలాంటి విలువలేదు.

ఆజాద్ చెబితే వినే నేతలెవరు లేరక్కడ. కారణం ఏమిటంటే జమ్మూకాశ్మీర్ ను వదిలేసి దశాబ్దాలవుతోంది. తన మాట చెల్లుబాటు కానీ రాష్ట్రంలో ప్రచారబాధ్యతలు తీసుకుని ఉపయోగంలేదని ఆజాద్ అనుకునుంటారు.

ఇక రెండో కారణం ఏమిటంటే రాజ్యసభ పదవీకాలాన్ని సోనియా పొడిగించలేదు. ఆజాద్ వ్యవహారం ఎలాగుంటుందంటే పార్టీకి మంచి రోజులున్నంతకాలం ఆకాశమేహద్దుగా చెలరేగిపోయారు. ఏ రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నా అక్కడ ఇన్చార్జిగా వ్యవహరించారు.

ఈయన వల్ల పార్టీకి జరిగిన లాభం ఏమీలేకపోయినా పార్టీ లబ్దిపొందిన ప్రతిసారి ఆజాద్ వల్లే లాభపడిందనే కలరింగ్ ఇప్పించుకునేవారు. దాంతోనే పార్టీలో అత్యంత కీలకనేతనే గుర్తింపు తెచ్చుకున్నారు. నిజంగానే ఆజాద్ అంతటి శక్తమంతుడైతే సొంతరాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి ఎందుకు దూరమవుతుంది ?

యూపీఏ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నుండి పార్టీలో ఆజాద్ మాట చెల్లుబాటవటం తగ్గిపోయింది. దాంతో సోనియా మీద మంటమొదలైంది. దగ్గర దగ్గర 75 ఏళ్ళ వయసులో కూడా అన్నీ పదవులు తనకే కావాలని, తనకే గుర్తింపు దక్కాలన్న ఆజాద్ ఆలోచన వల్లే పార్టీలో సమస్యలు పెరిగిపోతున్నాయి. దీంతో పార్టీలోనే ప్రెజర్ గ్రూప్ అని ఒకటి తయారైంది. ఈ నేపధ్యంలోనే సోనియా వేసిన ప్రచారకమిటి బాధ్యతలను ఆజాద్ తిరస్కరించారు.