Begin typing your search above and press return to search.

న‌ర్స‌య్య‌లా ఉండ‌లేరు.. కానీ, ట్రై చేయొచ్చుగా!

By:  Tupaki Desk   |   3 Nov 2022 2:30 AM GMT
న‌ర్స‌య్య‌లా ఉండ‌లేరు.. కానీ, ట్రై చేయొచ్చుగా!
X
నేటి రాజ‌కీయాలు, నేత‌ల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు.. పాలిటిక్స్ ఇంత ఖ‌రీద‌య్యాయా? అనే ప్ర‌శ్న త‌ర‌చుగా వేస్తుంటారు. అంతేకాదు, పాలిటిక్స్ అంటే కుళ్లు అని.. విమ‌ర్శ‌లు చేస్తుంటారు. ఇక‌, రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయాలు, నేత‌ల‌ను గ‌మ‌నిస్తున్నవారు.. వ‌ద్దు బాబోయ్ ఈ రాజ‌కీయాలు అనేస్తున్నారు. కానీ, నాయ‌కులు అంద‌రూ ఒకే ర‌కంగా ఉంటారా? ఉండ‌రు. నిస్వార్థంగా సేవ చేసిన వారు కూడా ఉన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు తరాలకు తరగని ఆస్తిని కూడగట్టుకుంటున్న సందర్భంలో ప్ర‌స్తుత ఎమ్మెల్యేలు ఉన్నారు. స‌ర్పంచ్ ఫార్చున‌ర్ కారులో తిరుగుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అంతేకాదు, ఒక్కసారి ప్రజాప్రతినిధి అయితే చాలు కోట్లు గడిస్తున్నారు.

అయితే, అంద‌రూ అలా ఉండ‌ర‌నడానికి, ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా చిల్లిగవ్వ కూడా సంపాదించుకోని ఏకైక నాయ‌కుడు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్నారు నేటికీ వ్యవసాయ పనులు చేసుకుంటూ.. విప్లవోద్యమ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజల్లో నాలుకలా మెదలుతున్నారు. ఇంత సాదారణ జీవితాన్ని గడుపుతున్న ఆయన ఎవరో కాదు.. గుమ్మడి నర్సయ్య. తెలంగాణ సాయుధపోరాటాన్ని నడిపిన రావి నారాయణరెడ్డి అసెంబ్లీకి రిక్షాలో వెళ్లేవారని విన్నాం. గుమ్మడి నర్సయ్య కూడా అంతే ఎక్కడో ఓ మూలనున్న ఖమ్మం జిల్లా ఇల్లందు నుంచి అసెంబ్లీకి ఎర్రబస్సులో వచ్చేవారు.

ఇతర పనులపై హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయన జీహెచ్‌‌ఎంసీ ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనం తింటూ కనిపిస్తుంటారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం సాధారణ జీవితాన్నే గడిపారు. బస్సులు, రైళ్లలో హైదరాబాద్‌ వచ్చి ఆటోలో అసెంబ్లీకి వెళ్లడం, పార్టీ ఆఫీస్‌లోనే బస చేయడం ఆయనకు అలవాటు. ఇప్పటికీ అయన పేరు మీద ఓ పొలం తప్ప మరేమీ లేదంటే అతిశయోక్తి కాదు. మ‌రి ఇలాంటి నాయ‌కుల‌ను చూస్తే ఏమ‌నిపిస్తుంది. రెండు చేతులూ ఎత్తి కాళ్ల‌పై ప‌డిపోవాల‌ని అనిపించ‌దూ! అంతేకాదు.. ప్ర‌స్తుత నాయ‌కులు క‌నీసంలో క‌నీసం.. న‌ర్స‌య్యంత ఎక్స్‌పెక్ట్ చేయ‌క‌పోయినా.. ఎంతో కొంత ఆయ‌న‌లా ఉండాల‌ని కోరుకుంటే త‌ప్పులేదుగా!

ఎవ‌రీ న‌ర్స‌య్య‌..

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం టేకుల గూడెం గ్రామానికి చెందిన గుమ్మడి నర్సయ్య సర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు. సీపీఐ ఎంఎల్‌ పార్టీ విప్లవ రాజకీయాల్లో రాష్ట్ర నాయకుడిగా, ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు పోటీ చేసి.. 1983, 1985, 1989, 1999, 2004లో ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. హంగు, ఆర్బాటాలకు తావులేకుండా తన పదవీ కాలమంతా ప్రజల మధ్యే గుమ్మడి నర్సయ్య గడిపారు. ఇప్పటికీ ఒక సామాన్య జీవితం గడుపుతున్నారు.

ఖమ్మం ఏజెన్సీతో పాటు గోదావరి అవతల నక్సల్స్ ప్రాభల్యం ఎక్కువ. దీన్ని పరిగణలోకి తీసుకుని అప్పటి ప్రభుత్వం నర్సయ్యకు ఇద్దరు గన్‌మెన్లను కేటాయించింది. గన్‌మెన్లను వద్దని చెప్పి వారించిన ధైర్యశాలి నర్సయ్య. ఆయనకు ఎమ్మెల్యే భృతి కింద వచ్చిన మొత్తాన్ని కూడా పార్టీని నడిపించడానికి ఇచ్చారని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఇప్పటికీ ఆయన వ్యవసాయం మీదే ఆధాపడుతూ జీవనం గడుపుతున్నారు.

ఇప్పుడెందుకీ ప్ర‌స్తావ‌న‌?

తాజాగా మునుగోడు ఎన్నిక‌ల నేప‌థ్యంలో సీపీఐ త‌రఫున ఆయ‌న‌ను ఎన్నిక ప‌రిశీలికుడిగా పంపించారు. ఇది ముగిసిన‌ త‌ర్వాత‌.. త‌న ఊరుకు వెళ్లేందుకు టీఆర్ ఎస్ నాయ‌కులు కారు పంపించినా..కాద‌ని బ‌స్సు కోసం వేచి చూసిన స‌మ‌యంలో ఆయ‌న‌ను కొంద‌రు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇదీ. న‌ర్స‌య్య నిబ‌ద్ధ‌త‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.