Begin typing your search above and press return to search.

కొత్తపల్లి గీతపై కులం కేసు మాఫీ చేసేసిన టీడీపీ

By:  Tupaki Desk   |   29 Jun 2017 5:32 AM GMT
కొత్తపల్లి గీతపై కులం కేసు మాఫీ చేసేసిన టీడీపీ
X
అరకు ఎంపీ కొత్తపల్లి గీత గిరిజన మహిళ కాదని, గిరిజనులకు కేటాయించిన ఎంపీ స్థానంలో ఆమె తప్పుడు కులధ్రువీకరణ పత్రంతో పోటీచేసి గెలుపొందారని, ఆమె ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో కేసు దాఖలు చేసిన అప్పటి ఆమె ప్రత్యర్ది - ప్రస్తుత ఎంఎల్‌ సీ గుమ్మడి సంధ్యారాణి తన పిటిషన్‌ ను ఉపసంహరించుకున్నారు. రాజకీయ కారణంగా తలెత్తిన ఈ పరిణామంతో గిరిజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

గిరిజనులపట్ల తెలుగుదేశం పార్టీకి, ఆ నాయకులకు ఏమాత్రం గౌరవం - ఆదరాభిమానాలు లేవని, అందుకే లాబీయింగ్‌ కే ప్రాధాన్యమిచ్చారనీ విమర్శిస్తున్నారు. ఈ విషయమై ఎంఎల్‌ సీ సంధ్యారాణి కూడా కేసు వాపసు తీసుకున్న విషయాన్ని ధ్రువీకరించారు. అయితే... ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అన్నవిషయంపై మాత్రం ఆమె సమాధానం చెప్పడం లేదట.

ఇంతకీ కొత్త పల్లి గీత విషయంలో సంధ్యారాణి యూ టర్ను తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా..? ఇంకేముంటుంది.. గీత వైసీపీ నుంచి గెలిచినా ఇప్పుడు టీడీపీ మనిషిగా మారిపోవడంతో ఆమెపై కేసు ఎగిరిపోయింది. హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. కొత్తపల్లి గీత ఎస్టీ కాదని నిర్ధారణ అవడం ఖాయమని భావిస్తున్న తరుణంలో హఠాత్తుగా పిటిషనర్ , టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ప్లేటు ఫిరాయించడం చిన్న విషయమేమీ కాదు. ఐదు రోజుల క్రితం చంద్రబాబునాయుడు స్వయంగా సంధ్యారాణిని పిలిపించి... కొత్తపల్లి గీత ఇప్పుడు టీడీపీలో ఉన్నారని కాబట్టి పిటిషన్ వెనక్కు తీసుకోవాలని ఆదేశించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కాగా గీత సోదరుడు ఎస్టీ కాదని అధికారులు ఇప్పటికే ధృవీకరించారు. కానీ... టీడీపీ పుణ్యమా అని గీత సోదరుడు ఎస్టీ కాకున్నా గీత మాత్రం ఎస్టీగా కొనసాగనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/