Begin typing your search above and press return to search.

తుపాకీ కాల్చిన పెళ్లికొడుకు అరెస్ట్ అయ్యాడు

By:  Tupaki Desk   |   4 Sep 2016 9:36 AM GMT
తుపాకీ కాల్చిన పెళ్లికొడుకు అరెస్ట్ అయ్యాడు
X
ఉత్సాహం మంచిదే. కానీ.. అది శృతిమించకూడదు. అత్యుత్సాహంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బలుపు చర్యకు పాల్పడిన పాతబస్తీ పెళ్లికొడుకు అడ్డంగా బుక్ అయ్యాడు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. తీవ్రసంచలనం రేపిన ఈ పాతబస్తీ పెళ్లి కొడుకు ఉదంతంలోకి వెళితే..

గత నెల 22న పాతబస్తీలో ఒక వివాహ వేడుక జరిగింది. పెళ్లిలో భాగంగా నిర్వహించే ఊరేగింపులో పెళ్లి కొడుకు ఉత్సాహం హద్దులు దాటింది. చేతుల్లోకి రెండు తుపాకీల్ని తీసుకున్న అతగాడు ఆరు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. పెళ్లి ఊరేగింపులో హీరోయిజాన్ని ప్రదర్శించినట్లుగా ఫీలైన ఈ పెళ్లికొడుకు బలుపు చేష్ట కాస్త ఆలస్యంగా వీడియో రూపంలో బయటకు వచ్చింది.

దీంతో ఒక్కసారి అలెర్ట్ అయిన పోలీసులు.. సదరు పెళ్లి కొడుకు ఎవరన్న విషయాన్ని ఆరా తీశారు. సోషల్ మీడియాలో వచ్చిన ఈ వీడియోను మొదట పోలీసులు ఖండించినా.. అనంతరం వాటిపైన విచారణ జరిపారు. చివరకు.. పాతబస్తీలోని షామా థియేటర్ ఎదుట ఈ కాల్పుల ఘటన చోటు చేసుకున్నట్లుగా పోలీసులు నిర్థారించారు. మీడియాలో పెద్ద ఎత్తున ఈ వ్యవహారం బయటకు రావటంతో బలుపు పెళ్లికొడుకు ఆచూకీ బయటకు వచ్చేసింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న వేళ.. సదరు పెళ్లికొడుకే పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయినట్లుగా చెబుతున్నారు. ఈ పెళ్లికొడుకు పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.