Begin typing your search above and press return to search.

బీజేపీ మహిళా బహిష్కృత నేతకు గన్‌ లైసెన్సు!

By:  Tupaki Desk   |   12 Jan 2023 10:30 AM GMT
బీజేపీ మహిళా బహిష్కృత నేతకు గన్‌ లైసెన్సు!
X
బీజేపీ మహిళా బహిష్కృత నేత నుపుర్‌ శర్మ ఒక టీవీ డిబేట్‌ లో మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశ, విదేశాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. మరోవైపు నుపుర్‌ శర్మను సమర్థిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడని రాజస్థాన్‌ లోని ఉదయపూర్‌ లో ఒక టైలర్‌ కన్హయ్యలాల్‌ ను పట్టపగలే అతడి షాపులోనే ఇద్దరు కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

నుపుర్‌ శర్మకు బెదిరింపుల నేపథ్యంలో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నమోదైన ఫిర్యాదులన్నింటిని విచారణ కోసం ఢిల్లీకి బదిలీ చేయాలని ఆమె విన్నవించారు. మరోవైపు తనను, తన కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులోని ఇద్దరు న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నుపుర్‌ శర్మ వ్యాఖ్యల వల్లే రాజస్థాన్‌ లోని ఉదయపూర్‌ లో టైలర్‌ ను దుండగులు హత్య చేశారని పేర్కొన్నారు. నుపుర్‌ శర్మ దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆదేశించారు.

అంతేకాకుండా దేశంతో ఆమెకు ముప్పు లేదని.. ఆమె వల్లే దేశానికి ముప్పు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ప్రతినిధి అయినంత మాత్రాన ఇష్టమొచ్చినట్టు మాట్లాడటానికి లైసెన్సు ఇచ్చినట్టు కాదని న్యాయమూర్తులిద్దరూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే నుపుర్‌ శర్మపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌పైనా సోషల్‌ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది. సుప్రీంకోర్టులోని ఆ ఇద్దరు న్యాయమూర్తుల వ్యాఖ్యలను తప్పుబడుతూ 15 మంది మాజీ న్యాయమూర్తులు, 77 మంది విశ్రాంత ఉన్నతాధికారులు, 25 మంది ఆర్మీ అధికారులు కలిసి బహిరంగ ప్రకటన విడుదల చేశారు. దానిపై వారంతా సంతకం కూడా చేసి సుప్రీంకోర్టు గత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో నుపుర్‌ శర్మ గన్‌ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోగా ఆమెకు గన్‌ మంజూరైంది. తన ప్రాణానికి ముప్పు ఉన్న నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం ఆమె గన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఆమెకు అనుమతి మంజూరు చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.