Begin typing your search above and press return to search.

నెంబర్ వన్ ఎమ్మెల్యే ఆమేనంట

By:  Tupaki Desk   |   14 Nov 2015 6:08 AM GMT
నెంబర్ వన్ ఎమ్మెల్యే ఆమేనంట
X
‘‘గుండా లక్ష్మీదేవి’’ పెద్దగా సుపరిచితం కాని పేరు. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా నానని ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఆసక్తికరంగా మారారు. ఎందుకంటే.. ఏపీలో అత్యుత్తమ ఎమ్మెల్యే ఎవరన్న అంశంపై జరిపిన సర్వేలో.. తాజాగా నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నారు గుండా లక్ష్మీదేవి. ఏపీలో ప్రభుత్వ పథకాల్ని సమర్థంగా అమలు చేయటంతో పాటు.. నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించటంలో ఆమె ముందున్నట్లుగా తేల్చారు.

ఇంతకీ గుండా లక్ష్మీదేవి ఎవరంటే.. శ్రీకాకుళం టౌన్ నియోజకవర్గ ఎమ్మెల్యే. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఘన విజయం సాధించిన ఆమె.. ఎన్నికల తర్వాత తన పని తీరుతో ఏపీలోనే నెంబర్ వన్ ఎమ్మెల్యేగా నిలిచారు. ఆర్థికంగా బలోపేతమైన కుటుంబానికి చెందిన ఆమెపై విమర్శలు.. ఆరోపణలు అస్సలు లేవని చెబుతారు. డబ్బు సంపాదన మీద పెద్దగా ఆసక్తి చూపించరని.. మొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన లక్ష్మీదేవి.. తాజా ర్యాకింగ్ పుణ్యమా అని ఇప్పుడు ప్రముఖంగా మారారు.

ఇక.. రెండో స్థానం శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ నిలవటం విశేషం. నాలుగో స్థానంలో మంత్రి అచ్చెన్నాయుడు నిలిచారు. మొదటి ఐదు ర్యాంకుల్లో మూడు ర్యాంకులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. ఇక.. మంత్రులగా బాధ్యతులు నిర్వర్తిస్తున్న పలువురు నేతలు.. యాభై ర్యాంకు తర్వాత ఉన్నారు. తాజాగా విడుదలైన ర్యాంకుల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణలో మార్పులు చోటు చేసుకుంటాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పనితీరు సరిగా లేకుండా.. ర్యాంకుల్లో ఒక మూల ఉన్న మంత్రుల విషయంలో చంద్రబాబు దృష్టి సారిస్తే మంచిదన్న మాట పలువురు వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఆ పని చంద్రబాబు చేస్తారా..?