Begin typing your search above and press return to search.

తెల్లవారుజామున మాదాపూర్ లో కాల్పుల షాక్.. అసలేం జరిగిందంటే?

By:  Tupaki Desk   |   1 Aug 2022 4:17 AM GMT
తెల్లవారుజామున మాదాపూర్ లో కాల్పుల షాక్.. అసలేం జరిగిందంటే?
X
కొత్త నెల.. కొత్త వారంలోకి అడుగు పెడుతున్న రోజున.. అనూహ్యంగా హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకున్న ఒక ఉదంతం ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. సైబరాబాద్ కు ఆయువుపట్టు లాంటి మాదాపూర్ పరిధిలో చోటు చేసుకున్న కాల్పుల వ్యవహారం ఉలిక్కిపడేలా చేసింది. సోమవారం తెల్లవారుజాము ప్రాంతంలో జరిగినట్లుగా భావిస్తున్న ఈ వైనం షాక్ కు గురి చేస్తోంది.

మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీ పరిధిలో కాల్పుల్లో ఒకరు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఒక భూవివాదానికి సంబంధించిన సిట్టింగ్ సీరియస్ గా మారటంతో.. కాల్పులు చోటు చేసుకోవటం గమనార్హం. ఈ కాల్పుల్లో ఇస్మాయిల్ అనే వ్యక్తి మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన సాదిక్.. ముజాహిద్.. జిలానీలు కాల్పుల ఘటనలో కీలక వ్యక్తులుగా అనుమానిస్తున్నారు.

పాత కక్షల నేపథ్యంలో కాల్పులు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. ఒక భూవివాదానికి సంబంధించిన సిట్టింగ్ లో చర్చలు జరుగుతున్నాని.. అవి కాస్తా లెక్కలు తేలకపోవటం.. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగిన వేళ.. పాతబస్తీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయల్ మీద కాల్పులు జరిగాయి. ఈ ఉదంతంలో ఇస్మాయిల్ అక్కడికక్కడే మరణించాడు.

మాదాపూర్ లో కాల్పులు జరిగితే.. ఇస్మాయిల్ డెడ్ బాడీని జూబ్లిహిల్స్ లోని నీరూస్ దగ్గర వదిలి వెళ్లినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మొత్తం ఆరు రౌండ్ల కాల్పులు జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు.

ఈ కాల్పుల్లో కీలకమని చెబుతున్న సాదిక్ విషయానికి వస్తే.. అతడు ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చినట్లుగా చెబుతున్నారు.కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొన్నారు.

డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కాల్పులు జరిగిన స్థలంలో.. బులెట్ షెల్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. కాల్పులకు కారణమైన నిందితులు పరారీ అయ్యారు. ఈ కాల్పుల వెనుక అసలేం జరిగిందన్న అంశాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు.