Begin typing your search above and press return to search.

అమెరికాలో గ‌న్ క‌ల్చ‌ర్ కు మ‌రో ఐదుగురు బ‌లి!

By:  Tupaki Desk   |   24 Jan 2019 8:09 AM GMT
అమెరికాలో గ‌న్ క‌ల్చ‌ర్ కు మ‌రో ఐదుగురు బ‌లి!
X
అమెరికాలో గ‌న్ క‌ల్చ‌ర్ మ‌రోసారి విషం చిమ్మింది. ఐదుగురి నిండు ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ బ్యాంకులోకి చొర‌బ‌డ్డ ఉన్మాది ఐదుగురిని దారుణంగా కాల్చిచంపాడు. కాల్పుల‌కు ముందే అత‌డు పోలీసుల‌కు ఫోన్ చేసి మ‌రీ తాను జ‌ర‌ప‌బోయే మార‌ణ హోమం గురించి వివ‌రాలు తెలియ‌జేయ‌డం గ‌మ‌నార్హం. 21 ఏళ్ల జీఫెన్ జావ‌ర్ ఎవాన్ పార్క్ క‌రెక్ష‌న‌ల్ ఇనిస్టిట్యూష‌న్ లో క‌రెక్ష‌న‌ల్ అధికారిగా గ‌తేడాది న‌వంబ‌రు 2న విధుల్లో చేరాడు. అయితే అత‌డు ఉద్యోగంలో ఎక్కువ కాలం కొన‌సాగ‌లేదు. ఈ నెల 9న రాజీనామా చేశాడు. అప్ప‌టి నుంచి ఎక్కువ‌గా ఒంట‌రిగానే ఉంటున్నాడు.

జీఫెన్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం సెబ్రింగ్‌ నగరంలో సన్‌ ట్రస్ట్ బ్యాంకులోకి తుపాకీతో చొర‌బ‌డ్డాడు. వెంట‌నే పోలీసుల‌కు ఫోన్ చేశాడు. తాను బ్యాంకులో కాల్పులు జ‌ర‌ప‌బోతున్న‌ట్లు చెప్పాడు. వెంట‌నే బ‌య‌ట‌కు రావాలంటూ ఫోన్ లో పోలీసులు చేసిన విజ్ఞ‌ప్తిని అత‌డు ప‌ట్టించుకోలేదు. విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు. కాల్పుల అనంత‌రం జీఫెన్ పోలీసుల‌కు మ‌ళ్లీ ఫోన్ చేశాడు. తాను ఐదుగురిని కాల్చి చంపిన‌ట్లు చెప్పాడు. ఆలోగా రంగంలోకి దిగిన స్వాట్ బ‌ల‌గాల ముందు జీఫెన్ లొంగిపోయాడు. కాల్పుల్లో మృతిచెందిన వ్య‌క్తులు బ్యాంకు అధికారులా లేక క‌స్ట‌మ‌ర్లా అనే సంగ‌తిని ప్ర‌స్తుతానికి పోలీసులు నిర్ధారించ‌లేదు.

జీఫెన్ కాల్పుల వెనుక కార‌ణాన్ని తెలుసుకునేందుకు వారు ప్ర‌య‌త్నిస్తున్నారు. అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగ‌డం ఇదే తొలిసారి కాదు. అక్క‌డ గ‌న్ కొనుగోలు చేసేందుకు పటిష్ఠ నిబంధ‌న‌లేవీ అమ‌ల్లో లేక‌పోవ‌డంతో ఎవ‌రు ప‌డితే వారు వాటిని కొనుగోలు చేస్తుంటారు. వ్య‌క్తిగ‌త ఆగ్ర‌హ‌-అసంతృప్తి జ్వాల‌లతో అమెరికా పౌరులు ఉన్మాదులుగా మారి కాల్పుల‌కు తెగ‌బ‌డుతున్న ఘ‌ట‌న‌లు ఎక్కువగా న‌మోద‌వుతున్నాయి. ఈ కాల్పుల్లో ఏటా వంద‌లమంది బ‌ల‌వుతున్నారు.