Begin typing your search above and press return to search.

గుంటూరులో టీడీపీ అభ్యర్థులు అలా చేస్తున్నారా!

By:  Tupaki Desk   |   23 March 2019 6:17 AM GMT
గుంటూరులో టీడీపీ అభ్యర్థులు అలా చేస్తున్నారా!
X
గుంటూరు ఎంపీ సీటు పరిధిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో తెలుగుదేశం అనుకూల పత్రిక ఒకటి ఇచ్చిన స్టోరీ ఆసక్తి దాయకంగా ఉంది. ఒక రకంగా వారిని నిందిస్తున్నట్టుగా ఉంది ఆ కథనం. ఎన్నికల వేళ డబ్బులు ఖర్చు విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరు పార్టీకి నష్టం కలిగించేలా, గుంటూరు ఎంపీ సీటు అభ్యర్థి గల్లా జయదేవ్ ను ఇబ్బంది పెట్టేలా ఉందని ఆ కథనం సారాంశం!

పోలింగ్ కు సమయం ఆసన్నమవుతున్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు డబ్బులు బయటకు తీయలేదని ఆ మీడియా వర్గం పోయింది. డబ్బుల ఖర్చుకు వారు ముందుకు రావడం లేదని, ఈ విషయంలో వాళ్లంతా గల్లా జయదేవ్ మీద ఆధారపడుతూ ఉన్నారని ఆ మీడియా వర్గం చెప్పుకొచ్చింది. అదేమంటే.. తమకు పోటీ పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదని, కేవలం పార్టీ కోరడం వల్లనే తాము పోటీ చేసినట్టుగా.. కాబట్టి తమ తరఫున కూడా ఖర్చు పెట్టుకోవాలని సదరు నేతలు గల్లా జయదేవ్ కు చెబుతున్నారట.

ఒకవైపు ఎన్నికల్లో ఖర్చుల విషయంలో ఈసీ నిబంధనలు ఉన్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా మీడియా మీదే ఉంది. అయితే తెలుగుదేశం అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం లేదని, అదేమంటే ఎంపీ అభ్యర్థి నుంచి వారు డబ్బులు అడుగుతున్నారని, అలా అందరి తరఫున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవడం ఆయనకు భారం అవుతోందని.. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చెప్పుకురావడం విడ్డూరంగానే ఉంది.

ప్రజాస్వామ్యంలో మీడియానే ఇలాంటి కథనాలు రాస్తుంటే, ఒక పార్టీ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టడం లేదని మీడియానే బాధ పడుతోందంటే పరిస్థితి ఎంత వరకూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే డబ్బులు ఖర్చు పెట్టడానికి అభ్యర్థులు వెనుకడుగు వేస్తున్నారని.. తెలుగుదేశం పార్టీ పరిస్థితి పట్ల కూడా ఆ మీడియా వర్గం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. డబ్బులు ఖర్చు పెట్టకపోతే వాళ్లు ఎక్కడ ఓడిపోతారో అనే అదుర్దా కూడా ఆ పత్రిక కథనంలో కనిపిస్తుండటం విశేషం!