Begin typing your search above and press return to search.

గుంటూరు జిన్నా టవర్ ఇష్యూపై పవన్ ఓపెన్

By:  Tupaki Desk   |   4 Jun 2022 3:16 AM GMT
గుంటూరు జిన్నా టవర్ ఇష్యూపై పవన్ ఓపెన్
X
పేర్ల మీద జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. దీనికి మతం రంగు పులిమేసి అడ్డదిడ్డంగా రాజకీయం చేసే వారికి కొదవ లేదు మన దగ్గర. గుంటూరు పట్టణంలోని జిన్నా టవర్ పేరును మార్చాలంటూ కొద్ది కాలంగా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించటం తెలిసిందే. అనూహ్య పరిణామాల నేపథ్యంలో స్వాతంత్ర్యానికి ముందు జిన్నా పేరుతో స్తూపాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. దేశ విభజనకు కారకుడైనప్పటికి.. ఆ ప్రాంతానికి జిన్నా చేసిన సేవలకు గుర్తింపుగా అక్కడ ఏర్పాటు చేసిన కట్టడానికి ఆయన పేరును ఉంచేశారు.

విభజన నేపథ్యంలో కొందరికి ఈ పేరు మీద అభ్యంతరం ఉన్నా పెద్దగా ప్రచారంలోకి రాలేదు. ఎప్పుడైతే బీజేపీ నేతలు ఎంట్రీ ఇచ్చారో.. ఈ వాదనను వినిపించే వారికి బలం చేకూరింది. అప్పటి నుంచి జిన్నా టవర్ పేరును మార్చాలన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. కొందరు టవర్ ను కూల్చేయాలన్న ప్రతిపాదన చేస్తుంటే.. మరికొందరు దాన్ని అలానే ఉంచేసి.. పేరును మార్చాలన్న వాదనను వినిపిస్తూ.. ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపిస్తున్నారు.

అయితే.. జిన్నా టవర్ కు ఆ పేరునే ఉంచేయాలని.. ఎలాంటి మార్పులు.. చేర్పులు చేయొద్దని కోరుకునే వారికి తక్కువేం కాదు. ఈ నేపథ్యంలో ఇదో ఇష్యూలా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సున్నిత అంశంపై తనకున్న అవగాహనను స్పష్టంగా.. సూటిగా చెప్పేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జిన్నా టవర్ పేరును మార్చాలని డిమాండ్ చేసే వారికి తనదైన రీతిలో ఆయన పలు సూచనలు చేశారు.

''దేశ విభజనకు మూల కారకుడు జిన్నా. గుంటూరులో జిన్నా టవరర్ కు ఆ పేరే కావాలనుకునే వారు ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. జిన్నా పేరుకు బదులుగా ఏ అబ్దుల్ కలాం పేరో పెట్టటం మంచిది. సున్నితఅంశాల ఆధారంగా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వాటికి జనసేన మద్దతు నిలవదు'' అని స్పష్టం చేశారు. తమ పార్టీ విధానాల గురించి మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో పవన్ మరో ఉదాహరణను చెప్పుకొచ్చారు.

కొంతకాలం క్రితం రామ తీర్థంలో చోటు చేసుకున్న వివాదం విషయాన్నిప్రస్తావించిన పవన్..అప్పట్లో తాము ఎంతమేరకు నిరసనను వ్యక్తం చేయాలో అంతే చేశామే తప్పించి.. అంతకు మించి చేయలేదని గుర్తు చేశారు.

తప్పులు చేసిన దోషులకు శిక్షలు పడాలే కానీ.. సామాన్యులు.. నిర్దోషులు మాత్రం ఇబ్బంది పడకూడదన్నారు. ఎలాంటి అయోమయానికి గురి కాకుండా.. ఉన్న ఇష్యూను ఉన్నట్లుగా తేల్చేసిన పవన్ తీరుకు ఎలాంటి స్పందనలు వస్తాయో చూడాలి.