Begin typing your search above and press return to search.

ఆ రెండు పార్టీల తరఫున గుంటూరు ఎంపీగా పోటీ చేసేది ఎవరు?

By:  Tupaki Desk   |   15 Jun 2022 9:30 AM GMT
ఆ రెండు పార్టీల తరఫున గుంటూరు ఎంపీగా పోటీ చేసేది ఎవరు?
X
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అన్వేషణ సాగిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో అంటే.. 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ గెలుపొందారు.

వాస్తవానికి ఈయన స్థానికుడు కాదు. గల్లా జయదేవ్ చిత్తూరు జిల్లాకు చెందినవారు. అయితే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కుమార్తెను జయదేవ్ వివాహం చేసుకున్నారు. తెనాలి కూడా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో గుంటూరు అల్లుడిగా గల్లా జయదేవ్ రెండుసార్లు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు.

ఈసారి జయదేవ్ అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. గతంలో తన తల్లి గల్లా అరుణకుమారి పోటీ చేసి గెలిచిన చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీకి గల్లా జయదేవ్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. అందులోనూ టీడీపీకి చంద్రగిరిలో ప్రస్తుతం గట్టి అభ్యర్థి కూడా లేరు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పోటీకి జయదేవ్ ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అభ్యంతరపెట్టకపోవచ్చని చెబుతున్నారు.

మరోవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ కు అభ్యర్థి కొరత వేధిస్తోంది. 2014 ఎన్నికల్లో గుంటూరు నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైఎస్సార్సీపీ గాలి వీచినా ఓటమి తప్పలేదు. 2019లో ఇక్కడ నుంచి పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 4,205 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈసారి మోదుగుల అసెంబ్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు.

వైఎస్సార్సీపీ సీటు కేటాయించకపోయినా వేరే పార్టీల నుంచి అయినా పోటీ చేసే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థిని వెతుక్కోవాల్సిందే.

ఇక మరో ప్రధాన పార్టీ జనసేన తరఫున యాదవ సామాజికవర్గానికి చెందిన బోనబోయిన శ్రీనివాస యాదవ్ మరోమారు పోటీ చేసే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి జనసేనలో చేరిన బోనబోయిన గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. లక్షకు పైగా ఓట్లు సాధించి ప్రధాన పార్టీల అభ్యర్థులకు షాకిచ్చారు. నియోజకవర్గం పరిధిలో కాపు, యాదవుల ఓట్లు అత్యధికంగానే ఉన్న నేపథ్యంలో ఈసారి బోనబోయినకు గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్పుకుంటున్నారు.