Begin typing your search above and press return to search.

నిన్న చ‌ద‌ల‌వాడ‌, నేడు న‌ల్ల‌పాటి!... గుంటూరు టీడీపీలో ర‌చ్చ‌ర‌చ్చ‌!

By:  Tupaki Desk   |   24 March 2019 1:27 PM GMT
నిన్న చ‌ద‌ల‌వాడ‌, నేడు న‌ల్ల‌పాటి!... గుంటూరు టీడీపీలో ర‌చ్చ‌ర‌చ్చ‌!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో ఏపీలో కీల‌క జిల్లాగా ఉన్న గుంటూరు జిల్లాలో అధికార టీడీపీలో కుమ్ములాట‌లు నానాటికీ పెరిగిపోతున్నాయి. అది కూడా ఏ చోటామోటా నాయ‌కుల మ‌ధ్యో ఈ కుమ్ములాట‌లు అనుకోవ‌డానికి లేదు... ఏకంగా నర‌స‌రావుపేట ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యే కోడెల శివ‌ప్ర‌సాద్ ల మ‌ధ్య నెల‌కొన్న ఈ విభేదాలు ఏకంగా జిల్లాలో పార్టీకి పెద్ద త‌ల‌నొప్పిగానే ప‌రిణ‌మించే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ఉప్పూనిప్పులా ఉన్న రాయ‌పాటి, కోడెల మ‌ధ్య ఎన్నిక‌ల షెడ్యూల్ విడుదల కాగానే విభేదాలు బ‌హిరంగ‌మైపోయాయి.

న‌ర‌స‌రావుపేట ఎంపీ టికెట్ కు రాయ‌పాటిని కాకుండా వేరే అభ్య‌ర్థిని రంగంలోకి దించేందుకు కోడెల తెర వెనుక య‌త్నాల‌ను సాగించ‌గా... కోడెల కంచుకోట అయిన న‌ర‌స‌రావుపేట అసెంబ్లీ నుంచి ఏకంగా కోడెల‌కు బ‌ద్ధ విరోధిగా ఉన్న చ‌ద‌ల‌వాడ అర‌వింద్ బాబుకు టికెట్ ఇప్పించేసిన రాయ‌పాటి త‌న‌దైన స‌త్తా చాటారని చెప్పాలి. చ‌ద‌ల‌వాడ అభ్య‌ర్థిత్వాన్ని ఆది నుంచి వ్య‌తిరేకిస్తూ వ‌చ్చిన కోడెల‌... ఒకానొక స‌మ‌యంలో ఏకంగా తాను ఈ ద‌ఫా న‌ర‌స‌రావుపేట అసెంబ్లీ నుంచే బ‌రిలోకి దిగేందుకు య‌త్నించారు. అయితే అధిష్ఠానం ఆదేశాల‌తో కోడెల వెన‌క్కు త‌గ్గ‌గా... రాయ‌పాటి మాత్రం చ‌ద‌ల‌వాడ‌కు టికెట్ ఇప్పించుకుని కోడెల‌పై పైచేయి సాధించారు. తాజాగా న‌ర‌స‌రావుపేట‌లో కోడెల వ‌ర్గానికి మరో బ‌ద్ధ విరోధిగా ఉన్న న‌ల్ల‌పాటి రామును రాయ‌పాటి ఏకంగా టీడీపీలో చేర్పించారు. కోడెలకు అస‌లు విష‌యం తెలియ‌కుండానే ఈ మొత్తం త‌తంగం న‌డిచింది.

కోడెల‌కు మాట మాత్రంగా కూడా చెప్ప‌కుండా న‌ల్ల‌పాటిని చంద్రబాబు వ‌ద్ద‌కు తీసుకెళ్లిన రాయ‌పాటి... పార్టీ అధినేత చేత కండువా వేయించారు. అప్ప‌టిదాకా విష‌యం తెలియ‌ని కోడెల‌... ఈ వార్త విన్న‌వెంట‌నే ఒక్క‌సారిగా షాక్‌ కు గుర‌య్యార‌ని చెప్పాలి. మొత్తంగా నాడు చ‌ద‌ల‌వాడ‌కు టికెట్ ఇప్పించిన రాయ‌పాటి... తాజాగా న‌ల్ల‌పాటిని పార్టీలో చేర్పించ‌డం... అది కూడా కోడెల‌కు మాట మాత్రంగా కూడా చెప్ప‌కుండానే ఈ మొత్తం వ్య‌వ‌హారాన్ని న‌డిపించ‌డం చూస్తుంటే... రాయ‌పాటి వ్యూహాల ముందు కోడెల తేలిపోయార‌ని చెప్పాలి. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఇలా ఇద్ద‌రు కీల‌క నేత‌లు వైరి వ‌ర్గాలుగా మారిపోయి వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు అమ‌లు చేస్తుంటే... పార్టీకి భారీ దెబ్బ త‌గిలినా పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.