Begin typing your search above and press return to search.

డిప్యూటీ స‌మ‌క్షంలోనే నేత‌ల రాజీనామ అస్త్రం!

By:  Tupaki Desk   |   25 Sep 2016 7:39 AM GMT
డిప్యూటీ స‌మ‌క్షంలోనే నేత‌ల రాజీనామ అస్త్రం!
X
క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా చెప్పుకొనే తెలుగుదేశం పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాటలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. సాక్షాత్తు ఉప‌ ముఖ్య‌మంత్రి - మంత్రుల స‌మ‌క్షంలో రాజీనామా చేస్తామంటూ అధికార పార్టీ నాయ‌కులే అల్టిమేటం జారీచేశారు. గుంటూరు జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప - వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు - జిల్లా అధ్యక్షులు-ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో నాయకులు వాగ్వాదానికి దిగారు. ఈ సంద‌ర్భంగా అవ‌స‌ర‌మైతే రాజీనామా చేస్తామంటూ వారు తేల్చిచెప్పారు.

పార్టీ త‌ర‌ఫున నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో రాజధాని గ్రామాలైన తుళ్లూరు - మండలం నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని - ఏ సమస్య చెప్పినా పరిష్కరించడం లేదని ఆరోపించారు. బీసీలకు రుణాలు మంజూరులోనూ తమ గ్రామాల లబ్ధిదారుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌ ఫార్మర్‌ కోసం ఏడాదిపాటు విన్నవించి చివరికి తామే రాస్తారోకో చేయాల్సి వచ్చిందని చెప్పారు. చిన్న సమస్యనూ పరిష్కరించలేని వారికి పదవులు - అధికారాలు ఎందుకని ప్రశ్నించారు. ఈ క్రమంలో మరోనాయకుడు శివరామకృష్ణయ్య కలుగజేసుకుని ఒక్కవార్డునైనా గెలిపించలేని 'మీరు మాట్లాడతారా' అని అనడంతో వాతావరణం మరింత వేడెక్కింది.

భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ద్వారా అందించే ప్లాట్లు ఏ నాయకుడొచ్చి ఇప్పిస్తాడో చూస్తాం.. పార్టీ కష్ట సమయంలోనూ సేవలందిస్తే ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోరా? అని మండిపడ్డారు. తమ సమస్యలు పార్టీ నాయ‌కులు పరిష్కరించకుంటే తాడోపేడో తేల్చుకుంటామని తేల్చిచెప్పారు. తాము ప్రస్తావిస్తున్న అంశాలపై చర్యలు వెంటనే తీసుకోకుంటే 300 మంది సభ్యులం రాజీనామా చేస్తామని టీడీపీకి చెందిన రాజధాని రైతులు హెచ్చరించారు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించకుంటే గ్రామాల్లోకి ప్రజాప్రతినిధులను రానిచ్చే ప్రసక్తే లేదని అక్కడి నుండి వెళ్లిపోయారు. దీంతో మంత్రులు స‌మావేశం నుంచి అర్దాంత‌రంగా వెళ్లిపోవాల్సి వ‌చ్చింది.