Begin typing your search above and press return to search.

ప‌ల్నాడు ఫైటింగ్‌:టీడీపీ, వైకాపా ఎమ్మెల్యేల అరెస్టు

By:  Tupaki Desk   |   29 Aug 2016 6:49 AM GMT
ప‌ల్నాడు ఫైటింగ్‌:టీడీపీ, వైకాపా ఎమ్మెల్యేల అరెస్టు
X
గుంటూరు జిల్లా పౌరుషాల గ‌డ్డ ప‌ల్నాడు ర‌గులుతోంది. అధికార‌ - విప‌క్ష ఎమ్మెల్యేల స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌తో అట్ట‌డుకుతోంది. ఇటీవ‌ల ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన కృష్ణా పుష్క‌రాలు పల్నాడులో ఇరు ప‌క్షాల మ‌ధ్య అగ్గిని రాజేసింది. దీంతో నిన్న‌టి నుంచి ప‌ల్నాడు ప్రాంతంలో పోలీసులు ఆంక్ష‌లు విధించారు. విష‌యంలోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలోని కృష్ణా తీర ప్రాంతంలో చేసిన పుష్క‌రాల ప‌నుల్లో అవినీతి రాజ్య‌మేలింద‌ని, అధికార పార్టీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు అందిన‌కాడికి దండుకున్నాడ‌ని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణా రెడ్డి తీవ్ర‌స్థాయిలో ఇటీవ‌ల మీడియా ముందు ఆరోపించారు.

దీనికి కౌంట‌ర్‌ గా మీడియా ముందుకు వ‌చ్చిన య‌ర‌ప‌తినేని.. పిన్న‌ల్లిపై అదే స్థాయిలో విరుచుకుప‌డ్డారు. త‌న‌కు అవినీతికి పాల్ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, తాను అవినీతికి పాల్ప‌డ్డ‌ట్టు నిరూపిస్తే.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని స‌వాలు రువ్వారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన మాట‌ల యుద్ధం స‌వాళ్లు, ప్ర‌తి స‌వాళ్ల‌కు దారితీసింది. ఈ క్ర‌మంలో ఈ నెల 29న సోమ‌వారం బ‌హిరంగ చ‌ర్చ‌కు ఇద్ద‌రు నేత‌లూ మీడియా మైకుల సాక్షిగా సిద్ధ‌మ‌య్యారు. దీనికి దాచేప‌ల్లి మండ‌లం నడికుడి మార్కెట్ యార్డులో చ‌ర్చ‌కు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో గ‌త రెండు రోజులుగా ఈ విష‌యంపై గుంటూరు అట్టుడుకుతోంది.

ఇద్ద‌రు నేత‌లు స‌హా వారి వారి అనుచ‌రులు బ‌హిరంగ చ‌ర్చ‌ నేప‌థ్యంలో అన్ని విధాలా రెడీ అవుతున్నార‌నే స‌మాచారం అంద‌డంతో పోలీసులు ముందుగానే అలెర్ట్ అయ్యారు. ఆదివారం మ‌ధ్యాహ్నం నుంచి ప‌ల్నాడు - దాచేప‌ల్లి - గుర‌జాల‌ - మాచ‌ర్ల త‌దిత‌ర ముఖ్య‌మైన ప్రాంతాల్లో పోలీసుల‌ను మోహ‌రించారు. ప్ర‌త్యేక ఆంక్ష‌లు స‌హా 144 సెక్ష‌న్ విధించారు. ముంద‌స్తుగా ఇద్ద‌రు ఎమ్మెల్యేలు య‌ర‌ప‌తినేని - పిన్నెల్లి ల‌ను సోమ‌వారం తెల్ల‌వారు జామునుంచే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వారి ప్ర‌ధాన‌ అనుచ‌రుల ఇళ్ల‌పైనా పోలీసులు డేగ క‌న్ను సారించారు. ఎక్క‌డ ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న జ‌రుగుతుందోన‌ని ముందుగానే ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేసిన పోలీసులు... అంద‌రూ సంయ‌మ‌నం పాటించాల‌ని హెచ్చ‌రించారు.

ఎక్క‌డా ఎలాంటి బ‌హిరంగ చ‌ర్చ‌లూ జ‌ర‌ప‌రాద‌ని, దీనికి పోలీసులు ఎలాంటి అనుమ‌తీ ఇవ్వ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాకుండా, ఎవ‌రైనా బ‌హిరంగ చ‌ర్చ‌లు చేసుకోవాలంటే.. మీడియాలో - న్యూస్ ఛానెల్స్‌ లో పెట్టుకోవాలని పోలీసులు ఒకింత ఘాటుగానే సూచించారు. మ‌రోప‌క్క‌, ప‌ల్నాడు విష‌యం సీఎం దృష్టికి కూడా వెళ్లిన‌ట్టు తెలిసింది. మ‌రి దీనిపై ఆయ‌న ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా పౌరుషాల గ‌డ్డలో మ‌రోసారి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.