Begin typing your search above and press return to search.

గుంటూరు యువ‌కుడు.. యూకేలో కౌన్సిల‌ర్!

By:  Tupaki Desk   |   10 May 2021 12:30 AM GMT
గుంటూరు యువ‌కుడు.. యూకేలో కౌన్సిల‌ర్!
X
ఇప్ప‌టికే ఎంతో మంది భార‌తీయులు, తెలుగువారు అమెరికా మొద‌లు విదేశాల్లో రాజ‌కీయంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. యూకేలో కౌన్సిలర్ గా ఎన్నిక‌య్యాడో తెలుగు యువ‌కుడు! హ్యాంప్ షైర్ రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో.. బేజింగ్ స్టోక్ ఆగ్నేయ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో నిలిచి.. విజ‌యం సాధించారు ముమ్మ‌ల‌నేని అరుణ్ (45).

ఈ నెల 6వ తేదీన అక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగాయి. క‌న్జ‌ర్వేటివ్ పార్టీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన అరుణ్‌.. మంచి మెజారిటీతో విజ‌యం సాధించారు. అత్య‌ధిక స్థానాలు గెలుపొంద‌డంతో క‌న్జ‌ర్వేటివ్ పార్టీనే అధికారంలోకి రాబోతోంది. త్వ‌ర‌లోనే కౌన్సిల‌ర్లు లీడ‌ర్ ఆఫ్ ద హౌజ్ ను ఎన్నుకోనున్నారు. కాగా.. బేజింగ్ స్టోక్ ఆగ్నేయ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఒక తెలుగు వ్య‌క్తి గెల‌వ‌డం ఇదే మొద‌టి సారి. ఈ ప‌ద‌విలో అరుణ్ నాలుగేళ్లు కొన‌సాగుతారు.

గుంటూరు జిల్లా రేప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గంలోని మైనేనివారి పాలెంలో అరుణ్ జ‌న్మించారు. తండ్రి వెంక‌ట‌రావు ఎక్స్ స‌ర్వీస్ మెన్‌. కాగా.. ప్ర‌స్తుతం డిఫెన్స్ క‌న్స‌ల్టెంట్ గా ప‌నిచేస్తున్న అరుణ్‌.. సామాజిక సేవ కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొంటారు. త‌న సేవ‌ల‌కుగానూ 2017లో ప్ర‌ధాని చేతుల మీదుగా అవార్డు కూడా పొందారు. 2019లో బెస్ట్ వ‌లంటీర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడు.. కౌన్సిల‌ర్ గా ఎన్నిక‌వ‌డం గ‌మ‌నార్హం. ఈ విష‌యం తెలుసుకున్న ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.