Begin typing your search above and press return to search.

ఉగ్రదాడి లక్ష్యం అమర్ నాథ్ యాత్రికులా?

By:  Tupaki Desk   |   27 July 2015 10:26 AM GMT
ఉగ్రదాడి లక్ష్యం అమర్ నాథ్ యాత్రికులా?
X
పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. ఉదయం సైనిక దుస్తుల్లో వచ్చి, మెరుపు దాడికి దిగిన ఉగ్రవాదులను పోలీసులు కూడా గట్టిగానే ప్రతిఘటించారు... అయితే అప్పటికే తీవ్ర న‌ష్టం జ‌రిగిపోయింది.

ఉగ్రవాదుల తూటాల‌కు ఇప్పటివ‌ర‌కు 13 మంది చ‌నిపోగా, ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. తాజాగా ఎదురు కాల్పుల్లో ఎస్పీ స్థాయి అధికారి బ‌ల్జీత్ సింగ్ మ‌ర‌ణించారు. స్థానిక పోలీసు బ‌ల‌గాల‌తో క‌లిసి ఎన్ ఎస్జీ జరుపుతున్న ఉమ్మడి ఆప‌రేష‌న్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల అసలు లక్ష్యం అమర్ నాథ్ యాత్రికులని తెలుస్తోంది. అంతేకాదు... చొరబాటుకు ఎంచుకున్న ప్రాంతం కూడా కొత్తది కావడంతో టెర్రరిస్టులు తమ వ్యూహాలు మార్చుకుంటున్నారని అర్థమవుతోంది. రక్షణ వర్గాలు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.

దీనానగర్ లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా భారత భూభాగంగలోకి చొరబడ్డ నలుగురు ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలో మీటర్ల దూరంలోనే ఉన్న దీనానగర్ లోకి వారు సులువుగానే ప్రవేశించారు. తొలుత వారు తమకు కనిపించిన బస్సుపై కాల్పులు జరిపి, ఆ తర్వాత పోలీస్ స్టేషన్ పై అటాక్ చేశారు. ఆ తర్వాత అక్కడికి సమీపంలో ఉన్న పోలీస్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లోకి ప్రవేశించారు. పోలీసు కుటుంబాలకు చెందిన కొందరిని ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నట్లు సమాచారం.

అయితే... ఈ ఉగ్రవాద దాడి అసలు లక్ష్యం ఎవరున్న విషయంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.. నిజానికి ఉగ్రవాదుల లక్ష్యం అమర్ నాథ్ యాత్రికులు అని అంటున్నారు. రక్షణ రంగ నిపుణుడు ఎస్. ఆర్. సిన్హా దీనిపై మాట్లాడుతూ... చొరబాట్లకు సంబంధించినంత వరకూ ఉగ్రవాదులు తమ వ్యూహాలను మార్చుకుని ఉంటారన్నారు. బారీ వర్షాలు, కనురెప్పపడని నిఘా కారణంగా సంబా ప్రాంతం నుంచి చొరబాట్లు అసాధ్యంగా మారడంతో వీరు గురుదాస్పూర్ ను ఎంచుకుని ఉంటారని చెప్పారు. ఈ లెక్కన ఇకపై దేశవ్యాప్తంగా కొత్త ప్రాంతాల నుంచి ఉగ్రవాదులు చొరబడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారాయన. అమరనాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడి ఉంటారని సిన్హా చెబుతున్నారు. కాగా గురుదాస్ పూర్ ఉగ్రదాడిపై రేపు పార్లమెంటులో ప్రకటన చేస్తానని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.

ఈ ఘటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేశారు. దేశ వ్యాప్తంగా సున్నిత ప్రాంతాలలో భద్రత కట్టుదిట్టం చేశారు. నాసిక్, ముంబై, పూణెలలో హై అలర్ట్ ప్రకటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న సౌత్, నార్త్ బ్లాక్ లలో బందోబస్తు పెంచారు. గురుదాస్ పూర్ కాల్పుల పై ప్రధాని నరేంద్రమోడీ అత్యవసరంగా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

తెలుగు రాష్ర్టాల్లోనూ హైఅలర్ట్‌ ప్రకటించారు. విమానాశ్రయాల భద్రతను కట్టుదిట్టం చేశారు. సైనిక, పోలీసు ప్రధాన కార్యాలయాలు, పోలీసు క్వార్టర్స్‌ దగ్గర అప్రమత్తంగా ఉండాలని నిఘావర్గాలు సూచించాయి. హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలుగు రాష్ర్టాల్లో ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు.