Begin typing your search above and press return to search.

పంచ‌కుల కోర్టు తీర్పు!... బాబా రేపిస్టే!

By:  Tupaki Desk   |   25 Aug 2017 12:10 PM GMT
పంచ‌కుల కోర్టు తీర్పు!... బాబా రేపిస్టే!
X
ఆధ్యాత్మిక గురువుగా - దేశంలోనే పెను వివాదాస్ప‌ద మ‌త గురువుగా కీర్తిగాంచిన డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ను సీబీఐ కోర్టు రేపిస్టుగా ముద్ర వేసేసింది. దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూసిన బాబా కేసుపై కాసేప‌టి క్రితం పంచ‌కులలోని సీబీఐ కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. 2002లో త‌న ఆశ్ర‌మంలోని ఇద్ద‌రు సాద్వీల‌పై బాబా అత్యాచారం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. నాడే బాబాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు య‌త్నించినా... నాడు వివిధ కార‌ణాల వ‌ద్ద అరెస్ట్ జ‌ర‌గ‌లేదు. ఆ క్ర‌మంలో త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను తోసిపుచ్చే క్ర‌మంలో ఆయ‌న ఓ సినిమాను కూడా నిర్మించారు. స‌ద‌రు చిత్రానికి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించిన బాబా... త‌న‌ను తాను దేవుడిగా చిత్రీక‌రించుకున్నాడు.

అయితే ఆ త‌ర్వాత బాబా కేసును సీబీఐ టేక‌ప్ చేయ‌గా... ఆ కేసు విచార‌ణ పంచకుల‌లోని సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానంలో జ‌రిగింది. సుదీర్ఘంగా కొన‌సాగిన ఈ కేసు విచార‌ణ‌లో నేడు తీర్పు వెలువ‌డ‌నున్నందున డేరా మ‌ద్ద‌తుదారులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగేందుకు స‌న్నాహాలు చేసుకున్నారు. అంతేకాకుండా మొత్తం పోలీసు వ్య‌వ‌స్థ‌కే స‌వాల్ విసిరేలా నేటి ఉద‌యం భారీ కాన్వాయ్‌తో బాబాబ కోర్టుకు బ‌య‌లుదేరారు. అయితే ఎక్క‌డ కూడా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా పోలీసులు గ‌ట్టి బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. బాబాతో పాటు ఆయ‌న ముఖ్య అనుచ‌రుల‌కు మాత్ర‌మే కోర్టు ఆవ‌ర‌ణ‌లోకి అనుమ‌తించారు. ఇక బాబా కోర్టు హాలులోకి ప్ర‌వేశించ‌గానే న్యాయ‌మూర్తి ఆయ‌న‌ను దోషిగా ప్ర‌క‌టిస్తూ సంచ‌ల‌న తీర్పు చెప్పారు. బాబాపై న‌మోదైన అత్యాచారం కేసులో ఆధారాలున్నాయ‌ని, ఇద్ద‌రు సాద్వీల‌పై బాబా అత్యాచారం చేశార‌ని నిరూపిత‌మైంద‌ని న్యాయ‌మూర్తి ప్ర‌క‌టించారు.

బాబాను దోషిగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ... ఆయ‌న‌కు ఇంకా శిక్ష‌ను ఖ‌రారు చేయ‌లేదు. ఈ నెల 28న శిక్ష‌ను ఖ‌రారు చేయ‌నున్న‌ట్లు న్యాయ‌మూర్తి ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో బాబాను దోషిగా ప్ర‌క‌టించిన వెంట‌నే పోలీసులు ఆయ‌న‌ను త‌మ అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా డేరా మ‌ద్ద‌తుదారులు ఎక్క‌డ ఆందోళ‌న‌లు చేస్తారోన‌న్న అనుమానంతో బాబాకు కోర్టు ఆవ‌ర‌ణ‌లోనే వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి రోహ్ త‌క్ జైలుకు త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేశారు. రోడ్డు మార్గం మీదుగా కాకుండా హెలికాప్ట‌ర్‌ లో బాబాను జైలుకు త‌ర‌లించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉంటే... బాబాను రేపిస్టుగా తేలుస్తూ కోర్టు తీర్పు వెలువ‌రించ‌గానే... అక్క‌డికి స‌మీపంలోని డేరా మ‌ద్ద‌తుదారులు ఆందోళ‌న‌ల‌కు దిగారు. పంచ‌కుల‌లోని సెక్టార్‌-3లో నానా బీభ‌త్సం చేసిన బాబా మ‌ద్ద‌తుదారులు ప‌లు వాహ‌నాల‌కు నిప్పు పెట్టిన‌ట్టు స‌మాచారం.