Begin typing your search above and press return to search.

కీల‌క‌మైన జిల్లాలో ఆ నియోజ‌క‌వ‌ర్గం వైఎస్సార్సీపీలో హీట్ ఎక్కిస్తోందా?

By:  Tupaki Desk   |   1 Sep 2022 4:23 AM GMT
కీల‌క‌మైన జిల్లాలో ఆ నియోజ‌క‌వ‌ర్గం వైఎస్సార్సీపీలో హీట్ ఎక్కిస్తోందా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్ని పార్టీల‌కు కీల‌క‌మైన జిల్లా.. గుంటూరు. ఇక్క‌డ 17 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలోనే అత్య‌ధికంగా తూర్పు గోదావ‌రితోపాటు మూడు పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. అలాగే తూర్పు గోదావ‌రి జిల్లా త‌ర్వాత అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న జిల్లా కూడా గుంటూరే కావ‌డం గ‌మ‌నార్హం.

గ‌త ఎన్నిక‌ల్లో రేప‌ల్లె, గుంటూరు ప‌శ్చిమ మిన‌హాయించి మిగిలిన 15 అసెంబ్లీ సీట్ల‌ను వైఎస్సార్సీపీ ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఈసారి 17కి 17 స్థానాలు సాధించాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్ కంక‌ణం క‌ట్టుకున్నారు. అయితే వైఎస్సార్సీపీ ఆశ‌లు ఫ‌లించేలా లేవ‌ని అంటున్నారు.

ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ అత్యంత బ‌లంగా ఉన్న ప్రాంతం.. ప‌ల్నాడు. ఇప్పుడు ఈ ప్రాంతం ప‌ల్నాడు జిల్లాగా ఏర్పాటైంది. ఈ ప్రాంతంలో ఉన్న గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీ త‌ర‌ఫున కాసు మ‌హేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున జంగా కృష్ణ‌మూర్తి కీల‌క నేత‌గా ఉన్నారు. అంతేకాకుండా వైఎస్సార్సీపీ బీసీ విభాగం అధ్యక్షుడుగా, ఎమ్మెల్సీగానూ ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. జంగా కృష్ణ‌మూర్తి చిన్న కుమారుడు గామాల‌పాడు స‌ర్పంచ్‌గా, పెద్ద కుమారుడు పిడుగురాళ్ల జెడ్పీటీసీగా ఉన్నారు.

జంగా కృష్ణ‌మూర్తి గుర‌జాల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా 1999, 2004ల్లో ఘ‌న విజ‌యం సాధించారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి సన్నిహితంగా వ్య‌వ‌హ‌రించారు. ఇక 2009, 2014లో గుర‌జాల నుంచి టీడీపీ అభ్య‌ర్థి య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు విజ‌యం సాధించారు. 2009లో పోటీ చేయ‌ని జంగా కృష్ణ‌మూర్తి.. 2014లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున గుర‌జాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2019లో టికెట్ కోసం గ‌ట్టిగానే ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మ‌హేష్ రెడ్డికి వైఎస్సార్సీపీ గుర‌జాల సీటు ఇచ్చింది. జంగా కృష్ణ‌మూర్తికి ఎమ్మెల్సీగా చాన్స్ ఇచ్చింది.

ఈ నేప‌థ్యంలో గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్ద‌రు నేత‌లు.. కాసు మ‌హేష్ రెడ్డి, జంగా కృష్ణ‌మూర్తిల మ‌ధ్య వ‌ర్గ పోరు నెల‌కొంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. జంగా కృష్ణ‌మూర్తి.. యాద‌వ సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌. ఇటీవ‌ల ఆయ‌న శాస‌న‌మండ‌లి విప్ గా కూడా ఎన్నిక‌య్యారు.

ఈ నేప‌థ్యంలో స్వ‌గామ్రంలో జంగా అభిమానులు ఆయ‌న‌కు అభినంద‌న సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ స‌భ‌కు వెళ్లొద్ద‌ని ఎమ్మెల్యే కాసు మ‌హేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశార‌ని అంటున్నారు. అలాగే జంగాకు స్వాగ‌తం ప‌లుకుతూ గుర‌జాల‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను కూడా ఎమ్మెల్యే తొల‌గింప‌జేశార‌ని చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌తో జంగా కృష్ణ‌మూర్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం. ఎమ్మెల్యే ఆదేశాల‌ను ధిక్క‌రించి జంగా వ‌ర్గీయులు బ్యాన‌ర్లు ఏర్పాటు చేశారు. దీంతో ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య అభిప్రాయ భేదాలు రాజుకున్నాయ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్యేకాసు, ఎమ్మెల్సీ జంగా మధ్య పోరు ఎక్కడికి దారి తీస్తుందో అని వైఎస్సార్సీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయ‌ని తెలుస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.