Begin typing your search above and press return to search.

ఆదివాసీ సంస్కృతికి ప్రతీక ‘గుస్సాడీ’

By:  Tupaki Desk   |   28 Jan 2021 1:30 AM GMT
ఆదివాసీ సంస్కృతికి ప్రతీక ‘గుస్సాడీ’
X
ఆదిలాబాద్ ఆదివాసీ గూడేల్లో మాత్రమే కనిపించే నృత్యం 'గుస్సాడీ'. దీన్ని బాహుబలి సినిమాలో భళ్లాల దేవుడి పట్టాభిషేకం సందర్భంగా కూడా సినిమాలో వాడేశారు. ఈ గుస్సాడీ నృత్యం అనేది ఒక విశిష్టమైన కళ. రాజ్ గోండు గిరిజనుల ప్రత్యేకమైన నాట్యం.

ఈ గుస్సాడీ నృత్యంలో అపార నైపుణ్యం 'కనకరాజు' సొంతం. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామానికి చెందిన కనకరాజుకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 'పద్మశ్రీ' పురస్కారం ప్రకటించడంతో ఈయన ప్రతిభ వెలుగుచూసింది. అందరికీ అసలు ఈ తెలంగాణ గుస్సాడీ కళాకారుడి చరిత్ర అర్థమైంది. ఆదివాసీ సమాజానికి గౌరవాన్ని తెచ్చిన కనకరాజు ప్రాచీన కళకు ఎంతో ప్రాముఖ్యతను తెచ్చిన కళాకారుడు..

కొన్ని వందల ఏళ్ల నాటి ఈ ప్రాచీన దేవతా కళ తరతరాలు దాటుకుంటూ ప్రస్తుత ఆధునిక యుగంలోనూ దీన్ని నేటి తరానికి శిక్షణగా అందిస్తున్నాడు కనకరాజు. ఈ కళ ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్రలోనూ ఇంకా మనుగడలో ఉంది.

గుస్సాడీ నాట్యం శివుడి ప్రతిరూపం అని.. యత్మసూరు దేవత స్వరూపంగా గిరిజనులు భావిస్తారు. ప్రకృతి ఆరాధనగా దీన్ని పూజిస్తారు. 1940లో రాజ్ గోండులపై అధ్యయనం చేసిన హైమన్ డార్ఫ్, 1978లో ఆదిలాబాద్ కు వచ్చిన ఆయన శిష్యుడు మైకేల్ యార్క్ తమ రచనల్లో డాక్యుమెంటరీల్లో గుస్సాడీ కళను ప్రపంచానికి చాటారు.

ఆదివాసీ గూడేల్లో ప్రతి దీపావళి పండుగకు దండారి ఉత్సవాల్లో భాగంగా ఈ గుస్సాడీ ప్రదర్శనలను గిరిజనులు చేస్తారు. పురుషులు మాత్రమే నెమలి పించాలతో తయారు చేసి గుస్సాడీ వేషధారణతో ప్రత్యేకమైన నృత్యాలు చేస్తారు. నిష్టతో కఠిన నియమాలతో ఈ పండుగ జరిగినన్నీ రోజులు నృత్యాలు చేస్తారు.