Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ కొత్త ఎమ్మెల్సీతో ఏ రెడ్డి మంత్రికి ఎస‌రో...!

By:  Tupaki Desk   |   3 Aug 2019 7:55 AM GMT
టీఆర్ ఎస్ కొత్త ఎమ్మెల్సీతో ఏ రెడ్డి మంత్రికి ఎస‌రో...!
X
శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థి ఖ‌రార‌య్యారు. ఒకే ఒక స్థానానికి ఉప ఎన్నిక జ‌రుగుతుండ‌డంతో కేసీఆర్ ఎవ‌రిని ఎంపిక చేస్తార‌న్న‌ది చిన్నాపాటి స‌స్పెన్స్ నెల‌కొంది. ఎట్ట‌కేల‌కు ఇద్ద‌రు, ముగ్గురు నేత‌లు ఈ ప‌ద‌వికి పోటీ ప‌డినా కేసీఆర్ చివ‌ర‌కు మాజీ ఎంపి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ఖరారు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. గుత్తా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటనతో నల్లగొండ జిల్లాకు మరో ఎమ్మెల్సీ పదవి వరించినట్లు అయింది.

ఇప్ప‌టికే ఈ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న నేతి విద్యాసాగర్‌ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ గా కూడా ఉన్నారు. ఇక ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో డాక్టర్‌ తేరా చిన్నపరెడ్డి విజయం సాధిం చారు. అంతకుముందు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎమ్మెల్సీగా ఉండగా, ఆయన మండలిలో ప్రభుత్వ విప్‌ పదవిలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ నేత యాద‌వ‌రెడ్డిపై వేటు ప‌డ‌డంతో ఈ ఉప ఎన్నిక జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ కూడా పోటీ పెట్టే ఛాన్సులు లేక‌పోవ‌డంతో గుత్తా గెలుపు లాంచ‌న‌మే కానుంది.

మంత్రి ప‌ద‌వి ఖాయ‌మే...
సీనియ‌ర్ రాజ‌కీయ నేత అయిన గుత్తాకు జీవితంలో ఒక్క‌సారి అయినా మంత్రి అవ్వాల‌న్న కోరిక ఉంది. ఈ విష‌యాన్ని ఆయ‌న ప‌దే ప‌దే ఓపెన్‌ గానే చెపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున 2014 న‌ల్ల‌గొండ ఎంపీగా గెలిచిన ఆయ‌న అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేసేవారు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కే గులాబీ గూటికి చేరిపోయారు. ఆయ‌న చేరిక స‌మ‌యంలో మంత్రి ప‌ద‌వి హామీ ద‌క్కింద‌నే చ‌ర్చ జ‌రిగింది. కేసీఆర్ తొలి కేబినెట్‌ లో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి రాలేదు. గ‌త డిసెంబ‌ర్లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేసీఆర్ గుత్తాను ఉత్త‌మ్‌ కుమార్‌ రెడ్డి మీద హుజూర్‌ న‌గ‌ర్‌ లో పోటీ చేయాల‌ని చెప్పినా ఉత్త‌మ్‌ పై పోటీ చేసేందుకు గుత్తా వెన‌క‌డుగు వేశారు.

చివ‌ర‌కు కోదాడ నుంచి అయినా గుత్తా పోటీ చేస్తార‌ని... ఎమ్మెల్యేగా గెలిచి ఆయ‌న కేసీఆర్ కేబినెట్‌ లోకి ఎంట్రీ ఇస్తార‌న్న చ‌ర్చ‌లు జోరుగా వినిపించాయి. అయితే గుత్తా మాత్రం అటు హుజూర్‌ న‌గ‌ర్‌ లో ఉత్త‌మ్‌ మీద‌, ఇటు కోదాడ‌లో అప్ప‌టి ఎమ్మెల్యేగా ఉన్న ఉత్త‌మ్ భార్య ప‌ద్మావ‌తి మీద కూడా పోటీ చేసేందుకు వెన‌క‌డుగు వేశారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ అవ్వ‌డంతో ఆయ‌న రేపోమాపో కేసీఆర్ కేబినెట్‌ లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయ‌మే అంటున్నారు. కేసీఆర్ కేబినెట్‌ లో ఇప్ప‌టికే ఐదుగురు రెడ్డి మంత్రులు ఉండ‌డంతో గుత్తా ఎంట్రీ ఇస్తే ఎవ‌రో ఒక రెడ్డి మంత్రి అవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్న‌ట్టు భోగ‌ట్టా.