Begin typing your search above and press return to search.

కోమ‌టిరెడ్డికి రాజీనామా స‌వాల్ ఎదురైంది

By:  Tupaki Desk   |   17 Oct 2016 8:58 AM GMT
కోమ‌టిరెడ్డికి రాజీనామా స‌వాల్ ఎదురైంది
X
అధికార టీఆర్ ఎస్ పార్టీపై కాంగ్రెస్ శాస‌న‌స‌భా ప‌క్ష ఉప‌నేత - నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్లు ఆయ‌న‌కే బూమ‌రాంగ్‌లాగా మారాయి. తెలంగాణ‌లో కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌జ‌లు విసుగుచెందార‌ని, ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న గ‌జ్వేల్‌ లో కూడా టీఆర్ ఎస్ ఓడిపోతుంద‌ని కోమ‌టిరెడ్డి వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై టీఆర్ ఎస్‌ లో చేరిన నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ రాజీనామా సవాల్ విసిరారు. "టీఆర్ ఎస్ పార్టీపై - ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ నాపై అవాకులు చెవాకులు పేలుతున్న కోమ‌టిరెడ్డి వెంకటరెడ్డి...మనమిద్ధరం ఒకేసారి రాజీనామాలు చేసి ఎన్నికల బరిలోకి దిగి గెలుపేవరిదో తేల్చుకుందాం.నీకు దమ్ముంటే నా సవాల్‌ ను స్వీకరించు" అంటూ గుత్తా చాలెంజ్ విసిరారు.

ఈ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి తీరుపై గుత్తా విమ‌ర్శ‌లు గుప్పించారు. గత జూన్ 6వ తేదిన టీఆర్‌ ఎస్‌ లో చేరుతానంటు ఏర్పాట్లు చేసుకుని వెనక్కి వెళ్లిపోయిన కోమటిరెడ్డి రాజకీయ ఆయోమయంలో ఉన్నార‌ని గుత్తా ఎద్దేవా చేశారు. అందుకే మతిస్థిమితం కోల్పోయి తనను, టీఆర్‌ ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని గుత్తా మండిప‌డ్డారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ ఎస్‌ కు ఇరువై మంది ఎమ్మెల్యేలు కూడా గెలువరంటు కోమ‌టిరెడ్డి మాట్లాడిన తీరుకు టీఆర్‌ ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిన ఉప ఎన్నికలే సమాధానంగా నిలుస్తాయని గుత్తా చెప్పారు. వ్యవసాయం చేసి ఎరుగని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క దివంగ‌త సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేషంలో రోడ్లపై ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి టీఆర్‌ ఎస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని తప్పుడు విమర్శలు చేయడం విడ్డూరమని గుత్తా ఎద్దేవా చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/