Begin typing your search above and press return to search.

మరో రెడ్డికి హ్యాండిచ్చిన కేసీఆర్ - ఈయన హ్యాపీనే?

By:  Tupaki Desk   |   9 Sept 2019 11:00 PM IST
మరో రెడ్డికి హ్యాండిచ్చిన కేసీఆర్ - ఈయన హ్యాపీనే?
X
తనకు మంత్రి పదవిని ఇస్తానంటూ కేసీఆర్ ఆ ముచ్చట తీర్చలేదంటూ ఒకవైపు నాయిని నర్సింహారెడ్డి వాపోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో మొదటి నుంచి ఉన్న వారిలో నాయిని ప్రముఖుడు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా కూడా మెలిగారు ఆయన. ఆ మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకా - కేసీఆర్ సీఎం అయ్యాకా ఆయనకు హోం మినిస్టర్ పదవి దక్కింది. అయితే రెండోసారి సీఎం అయ్యాకా మాత్రం నాయినిని కేసీఆర్ పక్కన పెట్టారు.

కేబినెట్ విస్తరణల్లో ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీంతో నాయిని ఫైర్ అయిపోయారు. ఓనర్ లాంటి తనకు అవకాశం ఇవ్వకుండా, కిరాయి నేతలకు పదవులు ఇస్తున్నారంటూ కేసీఆర్ మీద ఫైర్ అయిపోయారు.

నాయిని సంగతలా ఉంటే..మరోవైపు మరో రెడ్డి నేతకు కూడా కేసీఆర్ హ్యాండిచ్చారు. ఆయనకూ మంత్రి పదవి దక్కలేదు. అయితే ఆయనకు శాసనమండలి చైర్మన్ పదవి ఖరారు అయ్యింది. ఆయన మరెవరో కాదు గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈయన కేసీఆర్ కేబినెట్లో చోటును ఆశించారు.

గతంలో నల్లగొండ ఎంపీగా ఉన్నప్పుడు ఫిరాయించి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి చేరిన వ్యక్తి గుత్తా. అప్పట్లోనే ఈయనకు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ ఆ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు కూడా గుత్తాకు ఆ అవకాశం దక్కలేదు. కానీ..ఆయనకు శాసనమండలి చైర్మన్ పదవి ఖరారు అయ్యిందని స్పష్టత వచ్చినట్టైంది. ఈ మేరకు ఆయన ఆ పదవికి నామినేషన్ కూడా దాఖలు చేశారు. మండలిలో బలాబలా ప్రకారం..ఆయనకు ఆ పదవి ఖరారు అయినట్టే! మంత్రి పదవి దక్కకపోయినా మండలి చైర్మన్ పదవిలో గుత్తా హ్యాపీనేనేమో!