Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో కొత్త పంచాయ‌తీ మొద‌ల‌యింది

By:  Tupaki Desk   |   14 Nov 2015 7:25 AM GMT
తెలంగాణ‌లో కొత్త పంచాయ‌తీ మొద‌ల‌యింది
X
తెలంగాణ రాష్ర్టంలో జిల్లాల పునర్విభజనకు ప్రభుత్వం వేగంగా ముందడుగు వేస్తుంటే..అదే క్ర‌మంలో అసంతృప్త జ్వాల‌లు సైతం రేగుతున్నాయి. ఇన్నాళ్లు జిల్లాల పునర్విభజన - కొత్త జిల్లాల ఏర్పాటు స‌హేతుకంగా లేద‌నే అభ్యంత‌రాలు తెర‌మీద‌కు రాగా....తాజాగా కొత్త పంచాయ‌తీ వచ్చిప‌డింది. య‌థావిధిగా ఈ డిమాండ్ ప్ర‌తిప‌క్షాల నుంచి రావ‌డం, అది కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ స‌ర్కార్‌ ను టార్గెట్ చేసేలా ఉండ‌టం గ‌మ‌నార్హం.

నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ప్రజాప్రతినిధులు - పార్టీల అభిప్రాయలు తీసుకోకపోవడం సమంజసంగా లేదంటూ నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేర‌కు ఏదో స్టేట్‌ మెంట్ ఇచ్చి వ‌దిలివేయ‌కుండా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మకు లేఖ రాశారు. ప్రభుత్వం ఏకపక్షంగా జిల్లాల పునర్విభజన కసరత్తు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో పార్లమెంటు - అసెంబ్లీ నియోజకవర్గాల కూర్పు ఎలా ఏర్పాటు చేస్తారో ఎంపీలకు - ఎమ్మెల్యేలకు కూడా తెలియని అయోమయం నెలకొందని గుత్తా అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు చేయదలిస్తే 17 పార్లమెంటు స్థానాలను ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేసుకుని అందుకు తగ్గ వసతులున్న పట్టణాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఒక్కో జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేలా చూడాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందుగా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు వాటి పరిధిలోకి వచ్చే మండలాల పునర్విభజనపై కసరత్తు చేయాల్సివుందన్నారు. పునర్విభజన ప్రక్రియపై ప్రజాప్రతినిధులతో పార్టీలతో చర్చించాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు.

ఇదిలాఉండ‌గా... జిల్లాల పునర్విభజన ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సాగిస్తున్న కసరత్తు వేగంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ నేతృత్వంలోని కమిటీ అన్ని జిల్లాల కలెక్టర్లను శాఖల వారీ స్థితిగతులపై నివేదికలు అందించాలని ఇప్పటికే ఆదేశించింది. ఇందులో జిల్లా జనాభా - భౌగోళిక స్వరూపం - వనరులు - సహజ వనరులు - తాగు - సాగునీటి వసతులు - ప్రభుత్వ కార్యాలయాల స్థితిగతులు - మండలాలు - గ్రామాలు - మున్సిపాల్టీల సంఖ్య - వాటిలో జనాభా - ఓటర్ల సంఖ్య - నియోజకవర్గాల సంఖ్య వాటి పరిధిలోని మండలాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు నివేదిక‌లు అంద‌జేయాల‌ని కోరారు. ఈ ప్ర‌క్రియ‌లో దాదాపు మెజార్టీ జిల్లాల క‌లెక్ట‌ర్ల వ‌ద్ద నివేదిక‌లు సిద్ధం అయిన‌ట్లు స‌మాచారం.