Begin typing your search above and press return to search.

ఎంపీ ప‌ద‌వికి రాజీనామాకు నేను రెడీఃగుత్తా

By:  Tupaki Desk   |   13 Sep 2017 4:34 PM GMT
ఎంపీ ప‌ద‌వికి రాజీనామాకు నేను రెడీఃగుత్తా
X
నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మెన్‌ పదవిని గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమించనున్నట్టు తెలిసింది. ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత చైర్మెన్‌ పదవిని ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కట్టబెట్టనున్నారు--ఈ వార్త గ‌త వారం రోజులుగా హ‌ల్‌ చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కీ దీనిపై కేసీఆర్ మ‌దిలో ఉన్న‌దేంటి? మీడియా విశ్లేష‌ణ ప్ర‌కారం పార్ల‌మెంటు స‌భ్య‌త్వానికి గుత్తా రాజీనామా చేయ‌నున్నారా? అంటే అవుననే స‌మాధానం వ‌స్తోంది అదికూడా సాక్షాత్తు గుత్తా నుంచే.

ఎంపీ పదవికి రాజీనామా చేయాలని తీసుకున్న నిర్ణయం నిజమేనని గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఓ మీడియా సంస్థ‌కు తెలిపారు. రాజీనామా చేస్తున్నారన్నది నిజమేనా అని అడిగినప్పుడు ఆయన అవున‌ని పేర్కొంటూ అయితే ఎప్పుడనేది ఇంకా తేదీని ఖరారు చేయలేదన్నారు. అన్ని విషయాలు త్వరలోనే మీడియా సమక్షంలో తెలియజేస్తానన్నారు. అయితే దసరా తర్వాత ఆయన రాజీనామా చేస్తారని తెలిసింది. రాజీనామా తర్వాతనే రైతు సమన్వయ సమితుల రాష్ట్ర చైర్మెన్‌ పదవి బాధ్యతలు తీసుకుంటారని గుత్తా వర్గీయులు తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.

అధికార టీఆర్‌ ఎస్‌ పార్టీ వర్గాల కథనం ప్రకారం.. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. కంటి ఆపరేషన్‌ కు ముందురోజు కేసీఆర్‌ ను మంత్రులు హరీశ్‌ రావు - జగదీశ్‌ రెడ్డి - ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి - శాసనమండలిలో ప్రభుత్వవిప్‌ రాజేశ్వర్‌ రెడ్డి - మరికొందరు నేతలు కలిశారు. ఆ సమయంలోనే గుత్తా సుఖేందర్‌ రెడ్డి రాజీనామా అంశం చర్చకు వచ్చినట్టు వచ్చింది. అభిప్రాయం అడిగినప్పుడు కూడా గుత్తా సుముఖత వ్యక్తం చేశారని, ఇప్పటికిప్పుడు రాజీనామా లేఖను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పినట్టు తెలిసింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన గుత్తా సుఖేందర్‌ రెడ్డి - ఆ తర్వాత టీఆర్‌ ఎస్‌ పార్టీలో చేరారు. అయితే ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా గులాబీకండువా కప్పుకోనని ఆ రోజే గుత్తా చెప్పారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి, సత్తా చాటుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి - కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి(కోమటిరెడ్డి బ్రదర్స్‌) గుత్తాకు సవాల్‌ విసిరారు. దానికి ఆయన కూడా సై అన్నారు. అప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంగీకరించలేదు. సీఎం ఆదేశించిన వెంటనే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని గుత్తా ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఈ సమయంలో కొంతమంది నేతలు కాంగ్రెస్‌ లోనూ - బీజేపీలోనూ చేరబోతున్నట్టు లీకులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలకు వెళ్లడం వలన ఆ రెండు పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్‌ గట్టిగా ఉన్నారని టీఆర్‌ ఎస్‌ పార్టీ వర్గాలు అంటున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లోనూ - కాకినాడ కార్పొరేషన్లలోనూ అధికారపార్టీ టీడీపీ గెలిచిన విధానంపై సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. ఆ రెండుచోట్ల గెలిచి వైసీపీని - బీజేపీని టీడీపీ కోలుకోని దెబ్బతీసేందనేది రాజకీయ విశ్లేషకులు అంచనా. ఇదే ఊపుతో 2019 ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారచేపట్టేందుకు టీడీపీ ప్రణాళికలు వేసుకుంటున్నది. అదే ఫార్ములాతో తెలంగాణలోనూ ఉపఎన్నికలకు పోవాలన్న ఆలోచనలో కేసీఆర్‌ వ్యూహం రచిస్తున్నారు.