Begin typing your search above and press return to search.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీతో కలుస్తుందా?

By:  Tupaki Desk   |   24 Nov 2015 9:56 AM GMT
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీతో కలుస్తుందా?
X
సీనియర్ కాంగ్రెస్ నేత - నల్గొండ ఎంపీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని ఆయన ప్రకటించారు. 2019లో అధికారం చేజిక్కించుకునే దిశగా కాంగ్రెస్ వెళుతుందని ఆయన అన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడిపోయినా పెద్ద ఇబ్బందేమీ లేదని అంటూ వచ్చే ఎన్నికలలో విజయం సాదించడానికి ఆయా పార్టీలతో అవగాహన పెట్టుకుంటామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపైనా ఆలోచిస్తామని ఆయన చెప్పడం విశేషం. అయితే... ఇదెంతవరకు సాధ్యమన్నది మాత్రం ఆయన చెప్పలేకపోయారు.

జాతీయ స్థాయిలో బిజెపి ప్రత్యర్ది పార్టీ గా ఉన్నందున అది కాంగ్రెస్ - టీడీపీల మైత్రి సాధ్యంకాదు. పైగా టీడీపీ పుట్టుకే కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల కోసం మొదలైంది. అయితే.. ఒకప్పటి టీడీపీ నేతగా గుత్తా ఈ విధంగా వ్యాఖ్యానించడం ఆసక్తి కలిగిస్తోంది. అయితే.. ఇది గుత్తా అత్యుత్సాహంతో అన్న మాటా లేదంటే కాంగ్రెస్ పార్టీ మాటా అన్నది తెలియాల్సి ఉంది.

మరోవైపు తాజాగా వరంగల్ ఉప ఎన్నికలను, అంతకుముందు కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ - టీఆరెస్ కలిసినా కలవొచ్చన్నట్లుగా ఉంది. కొద్దికాలంగా టీడీపీ - టీఆరెస్ అధినేతలు సఖ్యంగా ఉంటున్నారు. అంతేకాదు... వరంగల్ లో ప్రచారానికి టీడీపీ నుంచి చంద్రబాబు కానీ, ఆయన తనయుడు కానీ రాలేదు. మరోవైపు కేసీఆర్ కూడా వరంగల్ ప్రచారంలో ఎక్కడా టీడీపీని కానీ, చంద్రబాబును పల్లెత్తు మాటనలేదు. ఈ దోస్తీ ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వారిద్దరూ కలిసి ఇప్పటికీ జీవచ్ఛవంలా ఉన్న కాంగ్రెస్ ను పూర్తిగా సాగనంపే అవకాశాలున్నాయి.