Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ లోకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ఎంపీ

By:  Tupaki Desk   |   3 Jun 2016 4:43 PM GMT
టీఆర్ ఎస్ లోకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, ఎంపీ
X
తెలంగాణ‌లో ప్ర‌స్తుతం టీఆర్ ఎస్ స‌ర్కార్ దూకుడు చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ కు శుభం కార్డు ప‌డేలా లేదు. ఈ రెండేళ్ల‌లో కాంగ్రెస్‌ - టీడీపీ - వైకాపా - బీఎస్పీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు - ఎంపీలు టీఆర్ ఎస్‌ లో చేరిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీఆర్ ఎస్ దూకుడుకు మిగిలిన పార్టీల‌న్ని కుదేల‌వ్వ‌గా ఒక్క కాంగ్రెస్ మాత్ర‌మే కాస్తో కూస్తో ఫైట్ ఇస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలు కారెక్కేయ‌గా ఇదే కోవ‌లో మ‌రో ఎంపీ - ఎమ్మెల్యే కూడా గులాబి గూటికి చేరుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న‌ట్టు టీ పాలిటిక్స్‌ లో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన జిల్లా న‌ల్గొండ‌. కొద్ది రోజుల క్రితం జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డ ఎమ్మెల్సీ స్థానంలో విజ‌యం సాధించింది. న‌ల్గొండ జిల్లా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి విజ‌యం సాధించి తెలంగాణ‌లో తిరుగులేని విజ‌యాల‌తో దూసుకెళుతున్న టీఆర్ ఎస్ స‌ర్కార్‌ కు దూకుడుకు బ్రేకులేసి అంద‌రిని ఆక‌ర్షించారు. ఇలా కాంగ్రెస్ సంస్థాగ‌తంగా చాలా బ‌లంగా ఉన్న ఈ జిల్లా నుంచి ఓ ఎంపీ - ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నార‌న్న వార్త‌లు ఆ పార్టీ నాయ‌కుల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

న‌ల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి - మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు టీఆర్ ఎస్‌ లో చేరుతున్న‌ట్టు తెలుస్తోంది. వీరిద్ద‌రు కేసీఆర్‌ ను క‌ల‌వ‌డంతో పాటు తెలంగాణ ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేయ‌డం చూస్తుంటే వీరు పార్టీ మార‌తార‌న్న అనుమానాలు కాంగ్రెస్ నేత‌లే వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఎంపీ గుత్తా మాట్లాడుతూ తెలంగాణ ప్రాజెక్టుల‌కు పూర్తి మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో పాటు, ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌ ను స్వాగ‌తిస్తున్న‌ట్టు చెప్పారు. టీ ప్రాజెక్టుల‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా ఆయ‌న ఖండించారు. గుత్తా మాట‌లు చూస్తుంటే కేసీఆర్‌ కు ఆయ‌న పూర్తి అనుకూలంగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.