Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ కు రెయిన్ గ‌న్ ఎందుకు తెలియ‌దంటే...

By:  Tupaki Desk   |   6 Sep 2016 6:49 AM GMT
జ‌గ‌న్‌ కు రెయిన్ గ‌న్ ఎందుకు తెలియ‌దంటే...
X
రాయలసీమలో వర్షాభావం నెలకొన్న ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా నీటి పంపిణీ - రెయిన్‌ గన్ల ద్వారా పంటలను కాపాడేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తీసుకున్న నిర్ణ‌యం అధికార‌-విప‌క్షాల మ‌ధ్య విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారుతోంది. రెయిన్‌ గ‌న్ పై ప్ర‌తిప‌క్ష నేత‌ జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌లపై తెలుగుదేశం శ్రేణులు విరుచుకుప‌డుతున్నాయి. ప్రభుత్వం చేసే మంచి పనులేవీ వైకాపా అధ్యక్షుడు జగన్‌ కు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు కరవుపై యుద్ధం చేస్తున్నారన్నారు. ఇంత చేస్తున్నా జగన్‌ కు కనిపించడం లేదంటే కళ్లుండి కబోధిలా ఆయన తయారయ్యారని ఆంజనేయులు ఎద్దేవా చేశారు. నెలకోసారి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎదో ఒక ప్రాంతంలో ధర్నా - దీక్షలు చేపట్టి చంద్రబాబుపై నోరుపారేసుకోవడం జగన్‌ కు అలవాటైపోయిందన్నారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి హయాంలో మేఘ మథనం పేరిట రఘువీరారెడ్డితో కుమ్మక్కై కోట్లాది రూపాయలు దండుకున్నారని విమర్శించారు.

జలయజ్ఞం పేరిట ప్రాజెక్టులు నిర్మించకుండా ముందుగా కాల్వలు తవ్వి వేలకోట్లరూపాయలు గుత్తేదార్లకు దోచిపెట్టి తన జేబులు నింపుకున్న ఘనత జగన్‌ కే దక్కిందని ఆంజ‌నేయులు విమ‌ర్శించారు. కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని, రాయలసీమలో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పట్టిసీమ ప్రాజెక్ట్‌ పూర్తిచేసి నదుల అనుసంధానం చేసి రాయలసీమకు నీరందించి చంద్రబాబు చరిత్ర సృష్టించారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం - రైతులు బాగుపడటం జగన్‌ కు ఏమాత్రం ఇష్టంలేదని ఆంజ‌నేయులు ధ్వజమెత్తారు. వరి - పత్తి - మిర్చి ఏవిధంగా పండిస్తారో తెలియని జగన్‌ వ్యవసాయం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తండ్రి వర్ధంతి రోజున ప్రశాంతంగా ఆయనకు నివాళులర్పించకుండా ఆయన సమాధి వద్ద కూడా రాజకీయాలు మాట్లాడుతూ వై.ఎస్‌ ఆత్మక్షోభించేలా జగన్‌ నడుస్తున్నారని విమర్శించారు.

జగన్‌ కు రెయిన్‌ గన్ల గురించి తెలియకపోవడం ఆశ్చర్యం ఏమీ లేదని, నిజంగానే వాటి గురించి ఆయనకు తెలియదని.. జగన్‌ కు తెలిసిందల్లా ఏకే 47గన్లు - ఐరన్‌ గనులు దోచుకోవడమేనని మ‌రో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమ‌ర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ పట్ల ప్రతిపక్షనేత జగన్‌ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని య‌ర‌ప‌తినేని పేర్కొన్నారు.రెయిన్‌ గన్లు ఎప్పుడో ఇడుపులపాయలో వినియోగించామని జగన్‌ చెప్పడాన్ని తప్పుబట్టారు. రెయిన్‌ గన్లు జగన్‌ కుటుంబం సొంత పొలాలకు వినియోగిస్తే చంద్రబాబు రైతుల పంటలను ఎండిపోకుండా అన్నదాతల సంక్షేమం కోసం వినియోగిస్తున్నారని య‌ర‌ప‌తినేని తెలిపారు. అవినీతి - అక్రమాలు కలిపితే జగన్‌ అని విమర్శించారు. చంద్రబాబుకు కరవు కనిపించడం లేదని, లోకేష్‌ బాబు దుర్మార్గుడని జగన్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందని వాయ‌న‌ ఎద్దేవా చేశారు. ఎవరు దుర్మార్గులో అయిదుకోట్ల మంది ప్రజలకు బాగా తెలుసునన్నారు. లోకేష్‌ కు జగన్‌ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.