Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీలు ఆంధ్రా విజ‌య్‌ మాల్యాలు.!

By:  Tupaki Desk   |   26 Nov 2018 3:21 PM GMT
టీడీపీ ఎంపీలు ఆంధ్రా విజ‌య్‌ మాల్యాలు.!
X
సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు మారు పేరు అయిన బీజేపీ ఎంపీ - ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి జీవీఎల్ న‌ర‌సింహారావు మ‌రోమారు త‌న‌దైన శైలిలో అదే త‌ర‌హాలో కామెంట్లు చేశారు. హైద‌రాబాద్‌ లోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో జీవీఎల్ నర్సింహారావు మాట్లాడుతూ ఈడీ తాజా సోదాల‌తో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీల బాగోతం బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. ఏపీ ఎంపీలు బ్యాంకులను ప్రజల సొమ్మును దండుకున్నార‌ని మండిప‌డ్డారు. తెలుగుదేశం ఎంపీలే విజ‌య్‌ మాల్యాలని ఆయ‌న మండిప‌డ్డారు. ``సుజ‌నాచౌద‌రికి ఇన్ని వేల‌ కోట్లు ఎక్కడి నుండి వచ్చాయి? ఇన్ని కంపెనీలు ఎక్కడివి? డొల్ల కంపెనీల‌తో 5780 వేల కోట్ల లూటీ చేశారు. దీనికి చంద్ర‌బాబు జ‌వాబు చెప్పాల్సిందే`` అని ఆయ‌న నిల‌దీశారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌పై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అయిన జీవీఎల్ న‌ర‌సింహారావు సంచ‌ల‌న రీతిలో స్పందించారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో తామే ప్రత్యర్థులము - తామే ప్రత్యామ్నాయం అని వివిధ పార్టీల నేత‌లు చెప్తున్నారని అయితే - ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నామ‌న్నారు. ప్ర‌జలను మధ్యపెట్టడానికి ఇరు పార్టీలు మోసం చేస్తున్నాయని, ఇవన్నీ ఒకే తాను ముక్కలేన‌ని జీవీఎల్ పేర్కొన్నారు. ``యూపీఏ చైర్‌ ప‌ర్స‌న్‌ సోనియాగాంధీ మొన్న సభలో ఒక్క మాట కూడా కేసీఆర్‌ను అనలేదు. ఎన్నికల తరువాత రాహుల్ - కేటీఆర్ భాయ్ భాయ్ అవుతారు. ఇప్పటికే ఓవైసీ - కేటీఆర్ కలిశారు. తరువాత ఈ కూటమిలో కేటీఆర్ కలుస్తారు.`` అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాహుల్‌ గాంధీని ఒక్క మాట కూడా కేసీఆర్ అనడం లేదని జీవీఎల్ విశ్లేషించారు. `ఇదంతా జగన్నాటకం. ఈ రాష్ట్రములో నిజమైన ప్రత్యమ్నాయం బీజేపీయే. టీడీపీ-కాంగ్రెస్-టీఆర్ ఎస్‌ లు మూడు కుటుంబ పార్టీలే. ఎన్నికల తరువాత అధికారం ఏ విధంగా పంచుకోవాలని మాట్లాడుకుంటారు. కాంగ్రెస్ అవినీతి పార్టీ అని కేసీఆర్ చెప్పారు. కానీ ఇప్పుడు ఒక్కమాట కూడా అనటంలేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో సోనియాగాంధీ - రాహుల్ తో కేసీఆర్ కలుస్తారు`` అని జీవీఎల్ పేర్కొన్నారు.

సోనియాగాంధీ మొన్న సభలో ఏపీ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చార‌ని జీవీఎల్ మండిప‌డ్డారు. ``ప్రత్యేక హోదా పేరుతో మళ్ళీ ఏపీ ప్రజలని వంచించడానికి ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ సోనియాగాంధీ - రాహుల్ దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఏపీకి హోదాపై ఆ పార్టీకే చెందిన క‌ర్ణాట‌క నేత వీర‌ప్ప‌మొయిలీ అడ్డుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ వారు హామీ ఇస్తున్నారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్ ఆడుతున్న కుట్రలు నమ్మరు. ప్రత్యేక హోదా అనేది చట్టం లేకపోయినా ఏపీ న్యాయం చేయాలని చూస్తున్నాం.`` అని ఆయ‌న వెల్ల‌డించారు.