Begin typing your search above and press return to search.
చంద్రబాబు ఇంతకు దిగజారుతారా:బీజేపీ ఎంపీ!
By: Tupaki Desk | 4 Jun 2018 10:10 AM GMTనాలుగేళ్ల పాటు బీజేపీతో అంటకాగిన ఏపీ సీఎం చంద్రబాబు హఠాత్తుగా యూటర్న్ తీసుకొని ఎన్డీఏ - బీజేపీతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి వరకు మిత్రపక్షంపై ఈగ వాలనివ్వని చంద్రబాబు....మోదీ - బీజేపీల పై మండిపడుతున్నారు. అప్పటివరకు మోదీని హీరోగా కీర్తించిన బాబు....ఒక్కసారిగా ఆయనను విలన్ ను చేశారు. బీజేపీ - మోదీలపై తనకు తోచినట్లుగా నిందలు వేస్తున్నారు. తాజాగా జరిగిన నవ నిర్మాణ దీక్ష సందర్భంగా గుజరాత్ లోని దొలేరా ప్రాజెక్టుకు కేంద్రం 98 వేల కోట్లు ఇచ్చిందని, అమరావతికి మొండి చెయ్యి చూపిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై బిజెపి రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహారావు మండిపడ్డారు. ఆ ప్రాజెక్టు విలువ మొత్తం కలిపినా 1400 కోట్లు దాటదని - సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మరీ ఇంత దిగజారి ఆరోపణలు చేస్తారా అంటూ జివిఎల్ ప్రశ్నించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి....ప్రధాని గురించి దుష్ప్రచారం చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. ఇటువంటి అవాస్తవాలని - నిరాధార ఆరోపణలను చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు.
ఏపీలో టీడీపీతో బీజేపీ తెగదెంపులు చేసుకున్న తర్వాత పథకం ప్రకారం కొంతమంది బిజెపిపై దుష్ప్రచారం చేస్తున్నారని జివిఎల్ ఆరోపించారు. చంద్రబాబు అబద్దాల కోరని - సీఎం స్థాయి వ్యక్తి అవాస్తవాలను ప్రచారం చేయడం సరికాదని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రాజెక్ట్ కు కేంద్రం 3 వేల కోట్లు ఇచ్చిందని చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆ ప్రాజెక్ట్ కు కేంద్రం కేవలం 3 వందల కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రాజకీయాలలో విమర్శలు - ఆరోపణలు సహజమని...కానీ ఈ స్థాయికి ఓ సిఎం దిగజారి మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. దొలేరా ప్రాజెక్ట్ కు కేంద్రం 98 వేల కోట్లు ఇచ్చిందని మహానాడులో చంద్రబాబు బల్లగుద్ది మరీ చెప్పారని, అసలు ఆ ప్రాజెక్ట్ మొత్తం విలువే 1400 కోట్లు దాటదని అన్నారు. 2009లోనే దొలేరాను ప్రత్యేక ఇండస్ట్రియల్ జోన్ గా ప్రతిపాదించారని, దేశంలోని 8 ఇండస్ట్రియల్ జోన్లలో దొలేరా ఒకటని క్లారిటీ ఇచ్చారు. ఆ జోన్లకు 2500 నుంచి 3 వేల కోట్ల వరకు కేంద్రం కేటాయిస్తుందని జివిఎల్ తెలిపారు. ఇప్పటికి కేవలం 1293 కోట్లు మాత్రమే దొలేరాకు కేంద్రం మంజూరు చేసిందని చెప్పారు. కానీ, సిఎం చంద్రబాబుకు 98 వేల కోట్ల లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యర్థులపై చంద్రబాబు బురదజల్లడం....నిరాధార ఆరోపణలు చేసి ఇతరుల పరువుకు భంగం కలిగించడం సరికాదన్నారు.