Begin typing your search above and press return to search.

మోడీ అంటే చంద్రబాబుకు దడ!

By:  Tupaki Desk   |   2 March 2019 8:13 AM GMT
మోడీ అంటే చంద్రబాబుకు దడ!
X
ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి, తీసుకున్న నిర్ణయాలతో చంద్రబాబుకు ఓటమి దడ పుట్టిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు విమర్శించారు. శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన జీవీఎల్.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మోడీ ఏపీలో అమలు చేస్తున్న అభివృద్ధి - సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. ఇప్పటికే మోడీ ప్రభుత్వం ఏపీకి వేల కోట్ల రూపాయాల నిధులను అభివృద్ధి కోసం మంజూరు చేసిందని ఆ నిధులు చంద్రబాబు ప్రచారం కోసం వాడుకుంటూ ఏపీ అభివృద్ధి గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీకి మోడీ రైల్వే జోన్ ప్రకటిస్తారని తెలుసుకున్న చంద్రబాబు ఆ క్రెడిట్ బీజేపీకి దక్కకుండా కుటిలప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ తో ఏపీకి అపార అవకాశాలు లభించనున్నప్పటికీ.. ఆదాయం లేని రైల్వే జోన్ ప్రకటించారంటూ చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని దీనిని ఏపీ ప్రజలు గమనించాలని కోరారు. అలాగే మోడీ పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ 2 చేసినా ప్రపంచ దేశాలు భారత్ కే మద్దతు ఇవ్వడానికి ప్రధానం కారణం మోడీయేనని చెప్పారు. ఓవైపు త్రివిధ దళాలకు స్వేచ్చనిస్తూ మరోవైపు దౌత్యపరంగా విజయం సాధించారని కొనియాడారు.

ఇక సర్జికల్ స్ట్రైక్ దాడులను దేశభక్తి పేరుతో మోడీ తన ఖాతాలో వేసుకుంటున్నాడని పవన్ చేసిన వ్యాఖ్యలకు జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు. దేశమంతా ఇప్పటివరకు ఏ ప్రధాని సాహసించని నిర్ణయాన్ని మోడీ తీసుకుంటే మెచ్చుకోవాల్సింది పోయి విమర్శలు గుప్పిస్తావా అని జీవీఎల్ మండిపడ్డారు. జనసేన - టీడీపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని జీవీఎల్ విమర్శించారు.

చంద్రబాబుకు ఓటమి భయంపట్టుకొని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కూడా వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఈ ఇద్దరికి రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు. బీజేపీ ఏపీలోని అన్ని స్థానాల్లో పోటీ చేసి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మోడీని, బీజేపీని ఏమాత్రం అన్నా కూడా సహించకుండా జీవీఎల్ వాలిపోతున్నారు. బీజేపీ పార్టీ రక్తాన్ని నరనరాన వంటిపట్టించుకున్న జీవీఎల్ బాబు మాట్లాడిన ప్రతి మాటకు కౌంటర్ ఇస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఇప్పుడు ఆశ్చర్యకరంగా తమ మిత్రుడు అని ఆరోపణలు వచ్చిన పవన్ పై కూడా విమర్శలు గుప్పించడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.